ఎగ్జామ్​ ఏదైనా... జీఎస్​ కామన్​

తెలంగాణ ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న గ్రూప్స్​, పోలీస్​, టీచర్స్​ నోటిఫికేషన్​ ఏదైనా అందులో కామన్​ సిలబస్​ మాత్రం జనరల్​ స్టడీస్ (జీఎస్​)​. ఇందులో ముఖ్యంగా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్​ సైన్స్, కరెంట్​ ఎఫైర్స్​​ ఉంటాయి. నోటిఫికేషన్​ వచ్చేలోపు కామన్​ సబ్జెక్టులు​ ప్రిపేర్​ అయి ఉంటే తర్వాత ప్రిపరేషన్​ ఈజీగా కొనసాగిస్తూ, రివిజన్​కు టైమ్​ కేటాయించుకోవచ్చు. జీఎస్​లో ఉండే కామన్​ సబ్జెక్ట్స్​, ప్రిపరేషన్​ ప్లాన్​ ఈ వారం తెలుసుకుందాం..

ప్రిపరేషన్​ ప్రారంభించే ముందు ఎగ్జామ్​కు సంబంధించిన సిలబస్​ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఏ టాపిక్స్​ నుంచి ఎన్ని మార్కులు ఇస్తున్నారో గమనించాలి. సిలబస్​ మీద అవగాహన వచ్చాక స్టాండర్డ్ మెటీరియల్ ఎంపిక కీలకం. అకాడమీ, ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. నోటిఫికేషన్లు అన్నిటిలోనూ రాతపరీక్షల్లో ఉమ్మడిగా జీఎస్​ సిలబస్‌‌ ఉంటుంది. వీటి పరిధి పెద్దగా ఉన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడంలో అభ్యర్థులు ఆందోళనకు గురవుతుంటారు. వ్యూహాత్మకంగా ప్రిపరేషన్​ కొనసాగిస్తూ, సబ్జెక్ట్​లో ఏ టాపిక్​ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నల సరళి ఎలా ఉంటుందనే అంశం మీద ప్రిపరేషన్​ ఉండాలి.

ఒక్కో సబ్జెక్​.. ఒక్కో వెయిటేజ్​  
జీఎస్‌‌లో మొత్తం 12 విభాగాలు ఉన్నా అన్నింటికీ ఒకటే ప్రియారిటీ ఉండదు. ప్రధానంగా జాగ్రఫీ, మోడ్రన్​ ఇండియన్​ హిస్టరీ, పాలిటీ, జనరల్‌‌ సైన్స్, కరెంట్‌‌ అఫైర్స్, మ్యాథ్స్​, రీజనింగ్‌‌ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కావున టైమ్​ టేబుల్​ కేటాయించుకొని పక్కా ప్రణాళికతో ప్రాక్టీస్​ చేయాలి. మిగతా అంశాల్లో మార్కులు ఎక్కువ రాకపోయినా ఈజీగా చదివే పర్యావరణం, సైన్స్​ అండ్ టెక్నాలజీ, విపత్తు నిర్వహణ, గవర్నెన్స్‌‌ మొదలైన టాపిక్స్​ ఉంటాయి. వీటిని సులభంగా తక్కువ సమయంలో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత అవసరం అనుకుంటే గ్రాడ్యుయేషన్‌‌ స్థాయి పుస్తకాలు చదవొచ్చు. ప్రధానంగా తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాలు చదవాలి. భారత రాజ్యాంగం, పర్యావరణం, ఎకానమీలోని కొన్ని టాపిక్స్, భారత స్వాతంత్య్రోద్యమం, ప్రాచీన భారతదేశ చరిత్ర డిగ్రీ స్థాయిలో చదవాల్సి ఉంటుంది.

పరీక్ష ఆధారంగా ప్రశ్నల సరళి
రీజనింగ్, డేటా ఇంటర్‌‌ప్రెటేషన్‌‌ ప్రశ్నలస్థాయి పరీక్ష స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. కింది స్థాయి ఉద్యోగాల పరీక్షల్లో సాధారణ స్థాయి ప్రశ్నలుంటాయి. ఒక ప్రత్యేక సబ్జెక్టుకు సంబంధం ఉన్న పరీక్షలోని జనరల్‌‌ స్టడీస్‌‌లో కూడా రీజనింగ్‌‌ ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి.. గ్రూప్‌‌-1, గ్రూప్‌‌-2 పరీక్షల్లో సాధారణ స్థాయిలో కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ ఎక్కువ సందర్భాల్లో క్లిష్టత స్థాయి ఎక్కువ ఉన్న ప్రశ్నలు అడిగారు. అందువల్ల ఈ విభాగాన్ని ప్రిపేర్‌‌ అయ్యేటప్పుడు మొదటి నుంచి కొద్దిగా కఠినత్వం ఎక్కువగా ఉన్న ప్రశ్నలు ప్రాక్టీస్​ చేయాలి.

సిలబస్‌‌ ఒక్కటే
గ్రూప్‌‌–1, 2 రెండు పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు అనుసంధాన విధానాన్ని పాటించడం వల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందే అవకాశం లభిస్తుంది. గ్రూప్‌‌–1, 2 రెండింటిలోనూ దాదాపు ఒకే విధమైన సిలబస్‌‌ ఉంది. దీన్ని అభ్యర్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. సబ్జెక్ట్‌‌ల విషయంలోనూ కోఆర్డినేషన్‌‌ అప్రోచ్‌‌ కలిసొస్తుంది. పాలిటీ–ఎకానమీ, జాగ్రఫీ–ఎకానమీ, హిస్టరీ–జాగ్రఫీ.. ఇలా సబ్జెక్ట్‌‌ల మధ్య అనుసంధానం చేసుకోవాలి. ఏవైనా రెండు సబ్జెక్ట్‌‌లకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై విశ్లేషణాత్మక అవగాహన పొందే అవకాశం ఉంటుంది. గ్రూప్‌‌-1 పరీక్ష రాసే అభ్యర్థులు స్క్రీనింగ్‌‌ పరీక్షలో, మెయిన్స్‌‌లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించి ప్రిపేర్‌‌ అయ్యేటప్పుడే అనుసంధానం చేస్తూ ప్రిపేర్​ అయితే తక్కువ సమయంలో ఎక్కువ పట్టు సాధించవచ్చు. జనరల్‌‌ స్టడీస్‌‌ పేపర్‌‌లోని కొన్ని అంశాలు మిగతా పేపర్స్‌‌లో ఎక్కువ మార్కులు ఉన్నాయి.  గ్రూప్‌‌-2 రాస్తున్న అభ్యర్థులు జనరల్‌‌ స్టడీస్‌‌లో అంతర్భాగంగా కాకుండా వాటిని ప్రత్యేకంగా చదివితే మంచి స్కోర్​ సాధించవచ్చు.

గ్రూప్ ​1 టార్గెట్​గా సివిల్స్​ అభ్యర్థులు 
సివిల్స్‌‌, గ్రూపు-1 సిలబస్‌‌ దాదాపు 80 శాతం ఒకటే అయినందున గ్రూపు-1 రాసే ఇతర అభ్యర్థులకు సివిల్స్​ ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రంగా ఉంటుంది. అలాగని గ్రూప్‌‌ పరీక్షలకు సిద్ధమయ్యే వారు భయం లేకుండా శాస్త్రీయంగా, పక్కా ప్రణాళికతో సిద్ధమవ్వాలి. సిలబస్‌‌లోని ప్రతి పదం గురించి కనీసం ఒక పేజీ సమాచారం పాయింట్స్‌‌ రూపంలో తయారు చేసుకుంటూ నిరంతరం ప్రిపరేషన్‌‌ కొనసాగిస్తే సివిల్స్‌‌ అభ్యర్థులతో దీటుగా విజయం సాధించవచ్చు.

ప్రాక్టీస్​ టెస్టులతో మంచి స్కోర్​ 
ఒకే సబ్జెక్టుకు సంబంధించి అనేక పుస్తకాలూ, స్టడీ మెటీరియల్స్‌‌ను చదవటం సరికాదు. ఏదైనా ఒక చాప్టర్‌‌ను చదవగానే స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. దీనికి కొన్ని ప్రామాణిక టెస్టులను రాసి, ప్రాక్టీస్​ చేయాలి. ఎప్పటికప్పుడు టెస్టులు లేకుండా చదివితే ఆ ప్రిపరేషన్‌‌ వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ప్రిపరేషన్‌‌ పూర్తికాకుండా గ్రాండ్‌‌ టెస్టులను రాయకూడదు. ఇలా సిలబస్‌‌ మొత్తం చదవకుండా... సంపూర్ణ విషయ పరిజ్ఞానమేదీ లేకుండా గ్రాండ్‌‌ టెస్టులను రాస్తే అనవసరంగా నిరాశపడవలసి వస్తుంది. అలాకాకుండా పూర్తిచేసిన సిలబస్‌‌ నుంచి చాప్టర్‌‌వారీగా సమగ్రమైన టెస్టులను రాయటం సరైనది.