జనరల్​స్టడీస్: అంతరిక్ష సాంకేతికత.. అంతరిక్షం గురించి పాయింట్ టూ పాయింట్ ఫుల్ డీటైల్స్..

జనరల్​స్టడీస్: అంతరిక్ష సాంకేతికత.. అంతరిక్షం గురించి పాయింట్ టూ పాయింట్ ఫుల్ డీటైల్స్..

భూమి పైన సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల ఎగువ ఉన్న ప్రాంతాన్ని ఔటర్​స్పేస్​అంటారు. ఈ ఔటర్ స్పేస్లో మన సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలు, వాటి చుట్టూ పరిభ్రమించే చంద్రులు, మరుగుజ్జు ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉల్కలు, ఎన్నో గెలాక్సీలు, మరెన్నో నక్షత్రాలు భాగాలుగా ఉన్నాయి. వీటిని పరిశీలించే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రంగా పరిగణిస్తాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలు, అంతరిక్ష కేంద్రాలు, ఇతర మౌలిక సహాయక సదుపాయాలు, పరికరాలు, విధానాలు మిళితమై ఉంటాయి.

అంతరిక్ష పరిశీలనకు ఊతం ఇచ్చే రాకెట్​ఇంజిన్లను అభివృద్ధి పరిచే సాంకేతికతలపై 20వ శతాబ్దంలో ప్రధానంగా రష్యా, అమెరికా, జర్మనీలు దృష్టి సారించాయి. వాతావరణ అంచనాలు, రిమోట్​ సెన్సింగ్, జీపీఎస్​ వ్యవస్థల కార్యకలాపాలు, ఉపగ్రహ టెలివిజన్​, కొన్ని సుదూర సమాచార వ్యవస్థలు వంటి అనేక సాధారణ రోజువారీ సేవలు మొదలైనవన్నీ అంతరిక్ష మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉండేవే. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మూలంగా మానవాళి జీవన విధానం పెను మార్పులకు లోనవడమే కాకుండా అలాంటి కార్యక్రమాలను వాణిజ్యపరంగా చేపట్టిన కొన్ని దేశాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. 

భూమి నుంచి అంతరిక్షంలోనికి విభిన్న అవసరాల కోసం యాత్రలను నిర్వహించే వాహనాన్ని స్పేస్​ క్రాఫ్ట్​ అంటారు. వీటిని ముఖ్యంగా భూమి చుట్టూ నిర్ధారిత కక్ష్యల్లో పరిభ్రమింపజేయడానికి చంద్రుడి మీదకు ప్రయోగించడానికి, ఇతర గ్రహాల అన్వేషణలో ఉపయోగిస్తారు.

ఉదాహరణ: భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్–1, చంద్రయాన్–2, మంగళ్​యాన్. స్పేస్​ క్రాఫ్ట్​ భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి ప్రయాణించడానికి దానికి అధిక బలాన్ని అందించాల్సి ఉంటుంది. దీనిని వాహక నౌక ద్వారా అందిస్తారు. 

రాకెట్​ ఇంజిన్లలోని ఇంధనాలను(వీటిని సాధారణంగా ప్రొపెల్లెంట్స్ అని పిలుస్తారు) ఆక్సిడైజర్లతో కలిపి మండించడం ద్వారా ఏర్పడిన ఒత్తిడి రాకెట్లను ముందుకు నెట్టడం ద్వారా వాటి భూమి ఆకర్షణ పరిధిని దాటి ప్రయాణించగల పలాయన వేగాన్ని అందిస్తుంది. స్పేస్ క్రాఫ్ట్​ల్లోనూ ఇదే తరహా మెకానిజమ్​ ఉంటుంది.

కృత్రిమ ఉపగ్రహం
భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. కాగా, సాధారణ ప్రజోపయోగ కార్యక్రమాల కోసం రూపొందించిన కృత్రిమ ఉపగ్రహాలను మానవ నిర్మిత చంద్రులుగా పరిగణించవచ్చు. ఉదాహరణకు రిశాట్, ఓషియన్ శాట్, ఆస్ట్రోశాట్. విభిన్న మానవ అవసరాల దృష్ట్యా వివిధ రకాల ఉపగ్రహాలను నిర్మిస్తున్నారు. ఉదాహరణకు భూ పరిశీలన ఉపగ్రహాలు, సమాచార ఉపగ్రహాలు, రిమోట్​ సెన్సింగ్​ఉపగ్రహాలు, మార్గనిర్దేశక ఉపగ్రహాలు, మిలటరీ ఉపగ్రహాలు, వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు మొదలైనవి. ఉపగ్రహాలు అందించే సేవల ఆధారంగా వాటిలోని పేలోడ్లు/ ఉపకరణాలు రూపొందిస్తారు. వేర్వేరు ఉపగ్రహాల్లో వేర్వేరు పేలోడ్లు అమర్చుతారు.

స్పేస్ ప్రోబ్​
విశ్వం అన్వేషణ చేసే క్రమంలో శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడానికి ప్రయోగించిన మానవ రహిత పరికరాలను స్పేస్ ప్రోబ్ అంటారు. శాస్త్రీయ సమాచార సేకరణకు స్పేస్ ప్రోబ్​ల్లో విభిన్న రకాల పరికరాలు లేదా పేలోడ్లను అమర్చి ప్రయోగిస్తారు. తొలినాళ్ల నుంచి అత్యధికంగా వినియోగించిన స్పేస్​ ప్రోబ్​ సౌండింగ్​ రాకెట్లు, లూనార్ స్పేస్ క్రాఫ్ట్, ఇంటర్ ప్లానెటరీ స్పేస్​ క్రాఫ్ట్, ప్లానెటరీ ప్రోబ్స్. 

సౌండింగ్​ రాకెట్లు
ప్రోబ్​ రాకెట్లు అని కూడా పిలిచే సౌండింగ్ రాకెట్లను ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల నమూనా ప్రయోగాలుగా పరిగణిస్తారు. అంతరిక్ష ప్రయోగాలు ప్రారంభించిన తొలినాళ్లలో భూ ఉపరితలం నుంచి వివిధ ఎత్తుల వద్ద వాతావరణ పరిశీలనలు, అధ్యయనాలు జరపడానికి సౌండింగ్ రాకెట్లను ప్రయోగించారు. ఈ పరిశీలనలకు అవసరమయ్యే పరికరాలను సౌండింగ్​రాకెట్లలో అమర్చి నిలువుగా ప్రయోగించడం ద్వారా అవి వాతావరణ ఎగువ పొరల వరకు చేరుకుని తమకు అప్పగించిన అధ్యయనాలను దిగ్విజయంగా జరుపుతాయి.

సాధారణంగా 5.4 కిలోల పేలోడ్లను 60కి.మీ.ల ఎత్తుకు చేరుకునేందుకు ఏక అంచె కలిగిన ఘన ఇంధనాన్ని వినియోగించే సౌండింగ్​ రాకెట్లను వినియోగించగా, 22 కిలోల పేలోడ్లను 300 కి.మీ.ల ఎత్తుకు చేరుకునేందుకు రెండంచెలు కలిగి ఉన్న ఘన ఇంధనాన్ని వినియోగించే సౌండింగ్​ రాకెట్లను ప్రయోగించారు.

లూనర్ స్పేస్ క్రాఫ్ట్
వీటిని చంద్రమండలంపైకి ప్రయోగించే మానవ రహిత స్పేస్​ క్రాఫ్ట్​లుగా పరిగణిస్తారు. చంద్రమండలాన్ని చేరుకునే సాంకేతికత అభివృద్ధికి ఈ ప్రయోగాలు ఎంతో ఉపయోగపడతాయి. ఉదాహరణకు లునా, జొండ్​(రష్యా), రేంజర్​(అమెరికా). 

ప్లానెటరీ ప్రోబ్స్
ఇవి అంతరిక్ష పరిశోధన కోసం చంద్రుడి వద్దకు లేదా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణించడం, తన ప్రయాణ మార్గంలో ఉన్న ఇతర గ్రహ వస్తువుల చుట్టూ పరిభ్రమించడం లేదా వాటిపై ల్యాండ్​ అవ్వడం, ఇంటర్​స్టెల్లర్ స్పేస్ లో తగిన పరిశోధనలు జరిపే ఉద్దేశంతో ప్రయోగించే మానవ రహిత స్పేస్​ క్రాఫ్టులు. 2014 నాటికి ఫ్లూటో గ్రహంపైకి తప్ప మిగిలిన అన్ని గ్రహాలపైకి ప్లానెటరీ ప్రోబ్స్​ను ప్రయోగించారు. 

ఇంటర్ స్టెల్లార్ ప్రోబ్స్
ఇతర గ్రహాల మధ్య నుంచి ప్రయాణిస్తూ సౌర కుటుంబ వ్యవస్థను దాటి ఇతర నక్షత్ర వ్యవస్థల వైపు ప్రయాణించే స్పేస్ క్రాఫ్టులను ఇంటర్​స్టెల్లర్​ప్రోబ్స్ గా పరిగణిస్తారు. ఉదాహరణకు వాయేజర్ 1 (2013), వాయేజర్​ 2(2013), పయనీర్​ 10, పయనీర్​11.