
- కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు?
- కేవలం డిప్రెషన్ వల్లే ఇలా చేసిందంటున్న కుటుంబసభ్యులు
జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు: గాజులరామారంలో కన్నబిడ్డలను అత్యంత కిరాతకంగా కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపి, సూసైడ్ చేసుకున్న తల్లి కేసు సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఈ హృదయవిదారక ఘటనపై అనేక చర్చలు కొనసాగుతున్నాయి. తన ఇద్దరు చిన్నారులు హర్షిత్ (11), ఆశీష్(7)ను నరికి చంపేంత నిర్ణయం తేజస్విని (35) ఎందుకు తీసుకుందన్నది ఎవరికీ అంతుబట్టట్లేదు.
ఈ ఘటనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొవిడ్ సమయం నుంచి తేజస్విని రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని ఆమె తరఫు బంధువులు చెప్తున్నారు. ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పటికీ నయం కాకుండా పోవడం, రోజురోజుకు ఆమెలో అసహనం పెరిగి డిప్రెషన్లోకి వెళ్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎవరూ లేకపోవడమే తప్పైందా?
తేజస్విని మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమెను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా.. ఇన్నాళ్లు ఎవరో ఒకరు భర్త లేదంటే ఆమె తల్లి, తండ్రి ఉండేవారు. లేదంటే పనిమనిషి గానీ ఉండేటట్టు చూసుకునేవారు. నాలుగైదు నెలలుగా ఆమె వద్దే ఉన్న తల్లి కొద్దిరోజుల కిందటే సొంతూరుకు వెళ్లింది. తేజస్విని చిన్న కొడుకు ఆశీష్ బర్త్‌డే ఈ నెల19న ఉండడంతో ఆ రోజు తిరిగి వద్దామనుకుంది.
ఆమె వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఈ ఘోరం జరగడం గమనార్హం. అమ్మమ్మే ఉండి ఉంటే బిడ్డతో సహా మనవళ్లనూ కాపాడుకునేదని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
భర్త ప్రేమే కోలుకోలేని నష్టం చేసిందా?
తేజస్విని అపార్ట్మెంట్లోని చుట్టుపక్కల వారితో తరచూ గొడవలు పడేది. ఆమె పరిస్థితిని చూసి అందరూ సహకరించేవారు. కానీ మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆమెను ఇంటి వద్ద కాకుండా ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్మెంట్ చేయించాల్సిందని వారి వెల్ విషర్స్ అభిప్రాయపడ్డారు. భార్య మీద ప్రేమతో తన వద్దే ఉంచుకొని ట్రీట్మెంట్ చేయించి, నయం చేసుకోవాలనే భర్త ఆలోచనే కోలుకోలేని నష్టం చేసిందనే వాదనలు లేకపోలేదు.
కత్తి ఎక్కడిదో..?
తేజస్విని తన కొడుకులను అత్యంత కిరాతకంగా నరికి చంపిన కత్తిపై చర్చ జరుగుతోంది. అసలు ఆమెకు కత్తి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. ఆమె కొనుగోలు చేసిందా? లేక ఎవరైనా తెచ్చిచ్చారా? అనే అనుమానాలకు సమాధానం దొరకడం లేదు. ఈ ఘటన జరగడానికి గంట ముందు తల్లికి ఫోన్ చేసి మాట్లాడిన తేజస్విని.. కేవలం గంటలోనే పిల్లలను నరికి చంపడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
ఎన్ని కష్టాలు ఉన్నా వాటి ప్రభావాన్ని పిల్లలపై చూపడమేంటనే ప్రశ్న అందరినీ కలిచివేస్తున్నది. అనారోగ్య సమస్యలున్నా ఎందరో చిన్నారులు పెరిగి పెద్దవారై.. ఉన్నత స్థానాలకు చేరుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా పిల్లలను చంపే హక్కు ఏ తల్లికి లేదని, ఇలాంటి సంఘటనల నుంచి మానవ సమాజం చాలా నేర్చుకోవాలని సైకాలజిస్టులు చెప్తున్నారు.
గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తి
గాంధీ దవాఖానలో తేజస్విని (35), హర్షిత్ (11), ఆశీష్ (7) డెడ్‌బాడీలకు శుక్రవారం పోస్టుమార్టం పూర్తైంది. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్దకు పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. నిన్నటి వరకు కళ్లముందే ఆటలాడిన ఇద్దరు చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరుమున్నీరు విలపించారు.
ఈ ఘటనకు సంబంధించి ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. పిల్లల అనారోగ్య సమస్యలతోపాటు భర్తతో తరచుగా గొడవలు జరుగుతున్నట్లు తేజస్విని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. దాని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు
మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. ఆర్ధిక ఇబ్బందులు కూడా లేవు. అంతా హ్యాపీగా ఉన్నాం. అసలు తేజస్విని ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు. మానసిక ఇబ్బంది వల్ల చేసిందని అనుకుంటున్నాం. మా అత్తమామలు కూడా నన్ను కొడుకులా చూసుకుంటారు. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను.
-తేజస్విని భర్త వెంకటేశ్వర రెడ్డి
ఫోన్ చేసిన గంటకే..
కేవలం డిప్రెషన్ వల్లే తేజస్విని ఈ ఘోరానికి పాల్పడింది. ఆర్థికపరంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు లేవు. గురువారం మధ్యాహ్నం మూడున్నరకు తల్లితో తేజస్విని ఫోన్ లో మాట్లాడింది. పిల్లలు కింద ఆడుకుంటున్నారని, తాను పడుకున్నానని తేజస్విని చెప్పింది. దీంతో పిల్లలకు దెబ్బలు తగులుతాయని, కిందకు వెళ్లి చూడమని తల్లి చెప్పింది. అంతలోనే నాలుగున్నర గంటల ప్రాంతాల్లో ఘోరం జరిగినట్లు ఫోన్ వచ్చింది.
– గాంధీ హాస్పిటల్ వద్ద తేజస్విని పెద్దమ్మ కృష్ణవేణి