జెన్సోల్​లో అంతా మోసమే !

జెన్సోల్​లో అంతా మోసమే !
  • ప్లాంటులో ప్రొడక్షన్​ సున్నా!
  • ఉన్నది ఇద్దరు ముగ్గురు కార్మికులే 

న్యూఢిల్లీ:  జెన్సోల్ ​ఇంజనీరింగ్​కు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకి వస్తోంది. ఇది వరకే ఈ సంస్థ నిధులను సొంతానికి వాడుకున్నట్టు తేలగా, పూణేలోని కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో అసలు తయారీయే జరగడం లేదని సెబీ అధికారులు గుర్తించారు. జెన్సోల్ షేర్ ధరను తారుమారు చేసిందని,  నిధుల దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ జూన్ 2024లో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సెబీ విచారణకు ఆదేశించగా ఈ విషయం తెలిసింది.  ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ,  పునీత్ సింగ్ జగ్గీలు లెక్కలను తారుమారు చేశారని కూడా వెల్లడయింది.

పూణే చకన్‌‌‌‌‌‌‌‌లోని జెన్సోల్ ఈవీ ప్లాంటును ఈ నెల తొమ్మిదో తేదీన ఎన్​ఎస్​ఈ అధికారి పరిశీలించారు. అక్కడ 2–-3 మంది కార్మికులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అయితే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో 2025లో ప్రదర్శించిన తమ కొత్త ఈవీకి 30వేల ఆర్డర్లు అందాయని ​ జనవరి 28న స్టాక్​ఎక్స్చేంజ్​లకు జెన్సోల్​ తెలియజేసింది. అవి ఆర్డర్లు కావని, కొన్ని సంస్థలతో కుదిరిన ఎంఓయూలు మాత్రమేనని సెబీ కనుగొంది. దాంట్లో కనీసం ఈవీల ధర, డెలివరీల వివరాలు కూడా లేవు.  మరికొన్ని కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు కూడా బోగస్​ అని బయటపడింది.    

లోన్ల డబ్బు సొంతానికి..

2022–2024 ఆర్థిక సంవత్సరాల మధ్య ఇరెడా, పీఎఫ్​సీల నుంచి జెన్సోల్ రూ. 977.75 కోట్ల రుణాలను పొందింది.  వీటిలో రూ. 663.89 కోట్లను 6,400 ఈవీలను కొనడానికి వాడతామని జెన్సోల్ ​తెలిపింది. చివరికి రూ.567.73 కోట్ల విలువైన 4,704 ఎలక్ట్రిక్ వెహికల్స్​ను మాత్రమే కొన్నది.  ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన నిధులు జెన్సోల్ లేదా జగ్గీల  సంస్థలకు తిరిగి వెళ్లాయని విచారణలో తేలింది. కొన్ని నిధులను ప్రమోటర్ల వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించారు. 

ఉదాహరణకు లగ్జరీ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కొనుగోలు, దగ్గరి బంధువులకు బదిలీలు,  ప్రమోటర్ల యాజమాన్యంలోని ప్రైవేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడులు వంటివి చేశారు. దీంతో సెబీ ప్రమోటర్లపై చర్యలు తీసుకుంది.  - తదుపరి నోటీసు వచ్చే వరకు సెక్యూరిటీల మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది. స్టాక్ విభజనను నిలిపివేసింది. జగ్గీ బ్రదర్స్​తోపాటు మరికొందరు కంపెనీ డైరెక్టర్ల పదవి నుంచి తప్పుకున్నారు.