Anmol Singh Jaggi: కుప్పకూలుతున్న కంపెనీ.. పొరపాటున కూడా ఈ స్టాక్ కొనకండి..!!

Anmol Singh Jaggi: కుప్పకూలుతున్న కంపెనీ.. పొరపాటున కూడా ఈ స్టాక్ కొనకండి..!!

Gensol Engineering: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు జగ్గీ సింగ్ బ్రదర్స్. ప్రస్తుతం వీరిపై మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ కొరఢా ఝుళిపించింది. వాస్తవానికి వీరిద్దరూ జెన్‌సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, బ్లూ స్మార్ట్ ఈవీ కంపెనీలకు వ్యవస్థాపకులు. అయితే వీరు ఏ కంపెనీలోనూ డైరెక్టర్లుగా ఉండకూడదని, అలాగే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేకుండా సెబీ నిషేధించింది.

అయితే సెబీ వీరిపై ప్రస్తుతం చర్యలు తీసుకోవటంతో జెన్‌సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి. మధ్యాహ్నం 12.23 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.122.68వద్ద ఉంది. వీరిపై చర్యలు తీసుకోవటానికి కారణం వారు చేసిన కుంభకోణం బయటకు రావటమే. అవును  జెన్‌సోల్ ఇంజనీరింగ్ సంస్థ ఐఆర్ఈడీఏ, పీఎఫ్సీ సంస్థల నుంచి 2021-24  మధ్య కాలంలో తమ ఈవీ కార్ రెయిడింగ్ అవసరాల కోసం రూ.978 కోట్లను రుణంగా పొందింది. వీటితో 6వేల 400 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తామని మాటిస్తూ వాటిని బ్లూ స్మార్ట్ సంస్థకు లీజుపై అందించనున్నట్లు అప్పట్లో రుణాలను పొందారు.

అయితే రుణంగా పొందిన వాటిలో కేవలం రూ.568 కోట్లను మాత్రమే ఈవీ కార్ల కొనుగోలుకు ఉపయోగించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం బ్లూ స్మార్ట్ సంస్థ భారీ నష్టాల కారణంగా తమ సొంత యాప్ నుంచి ఉబెర్ కింద ఫ్లీట్ సర్వీసెస్ ఆఫర్ చేయనున్నట్లు ఈవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దర్యాప్తులో భాగంగా ఈవీ కార్ల కొనుగోలు కోసం పొందిన రుణాలను ప్రమోటర్లు అన్మోల్ సింగ్, పునీత్ సింగ్ దారి మళ్లించినట్లు వెల్లడైంది. 

Also Read:-21 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్యలోటు..

ఈ క్రమంలో రూ.42 కోట్ల 94 లక్షలను సోదరులు తమకు ఈవీ కార్లను సరఫరా చేస్తున్న గోఆటో ఖాతాల నుంచి కేప్ బ్రిడ్జి సంస్థకు అక్కడి నుంచి డీఎల్ఎఫ్ రియల్‌ఎస్టేట్ సంస్థకు బదిలీ చేసినట్లు సెబీ గుర్తించింది. అయితే దీనిని వారు గురుగ్రాములోని అర్బన్ లగ్జరీ ప్రాజెక్టు కామెల్లియాస్‌లో అపార్ట్మెంట్ కొనుగోలుకు బదలాయించినట్లు వెల్లడైంది. అలాగే వెల్‌ఫ్రే సోలార్ ఇండస్ట్రీస్ ఖాతాల నుంచి జెన్ సోల్ సంస్థ ఈవీల కోసం ఉపయోగించాల్సిన మెుత్తంలో రూ.25కోట్ల 76 లక్షలు అన్మోల్ సింగ్ ఖాతాలకు, రూ.13 కోట్ల 55 లక్షలు పునీత్ సింగ్ ఖాతాలకు ఇతర మార్గాల్లో మళ్లించబడ్డాయని సెబీ దర్యాప్తులో గుర్తించింది. అలాగే వీరి ఖాతాల నుంచి కుటుంబ సభ్యులకు, కొన్ని ఇతర అవసరాలకు ఉపయోగించినట్లు తెలింది. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు జెన్సోల్ కంపెనీ షేర్లకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.