- వెరిఫికేషన్ కంప్లీట్ అయినవీ పెండింగ్‌లోనే...
- రూల్స్ ప్రకారం ఉన్నా కొర్రీలు పెడుతున్న ఆఫీసర్లు
- ఎలక్షన్ కోడ్వస్తే క్రమబద్దీకరణ కష్టమని ఆందోళన
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ ప్రక్రియ నత్తనడక సాగుతోంది. ఓవైపు ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యమవుతుండగా, మరోవైపు వెరిఫికేషన్ పూర్తయిన దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉంటున్నాయి. అన్నీ రూల్స్ ప్రకారం ఉన్నప్పటికీ కొందరు అధికారులు కావాలనే కొర్రీలు పెడుతూ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ రిలీజ్ అయితే వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోనున్నాయి. ఈలోగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ కంప్లీట్ కాకుంటే ఎలక్షన్స్ అయ్యే వరకు ఎదురుచూపులు తప్పవని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
7వేలకు పైగా అప్లికేషన్లు
ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఇండ్లతో పాటు చుట్టూ ఉన్న ఖాళీ జాగలను రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం 58, 59 జీవోలను తీసుకొచ్చింది. జీవో 58 కింద 120 గజాల లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరించనుంది. జీవో 59 ద్వారా 120 గజాల కంటే ఎక్కువ జాగలను స్లాబ్‌లుగా విభజించింది. వాటికి మార్కెట్ రేటులో 25 పర్సెంట్ నుంచి 100 పర్సెంట్వరకు రేట్లు నిర్ణయించింది. మొదట్లో 2014 జూన్ 2 కటాఫ్ డేట్ పెట్టిన సర్కారు మరింత మందికి లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో దానిని 2020 జనవరికి వరకు పొడిగించింది. జిల్లాలో జీవో 58 కింద ఈ ఏడాది 1,394 దరఖాస్తులు వచ్చాయి. జీవో 59 కింద 2023లో 2,820, 2022లో 2,028, మొత్తం 7,042 అప్లికేషన్లు అందాయి.
స్లోగా సర్వే..
58, 59 జీవోల కింద వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం జిల్లాలో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. జీవో 58 కింద 1,394 అప్లికేషన్లు రాగా, 1,376 వెరిఫికేషన్ పూర్తయింది. 18 పెండింగ్ ఉన్నాయి. అలాగే జీవో 59 కింద ఈ ఏడాది వచ్చిన 2,820 దరఖాస్తుల్లో 2783 వెరిఫికేషన్ చేయగా, మరో 37 మిగిలాయి. 2022లో 2828 అప్లికేషన్లకు గాను 1,396 మాత్రమే సర్వే చేశారు. ఇంకా 1,432 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జీవో 59 సర్వే కోసం జిల్లాలో తొమ్మిది టీమ్‌లను నియమించారు. ఒక్కో టీమ్‌కు జిల్లా స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. వారికి సహాయకులుగా రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ల సిబ్బందిని నియమించారు. అయితే అధికారులకు ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు నిర్లక్ష్యం వల్ల సర్వేలో ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
కొర్రీలు పెడుతూ..
ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ విషయంలో కొందరు అధికారులు దరఖాస్తుదారులను ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ రూల్స్ ప్రకారం ఉన్నప్పటికీ లేనిపోని కారణాలతో కొర్రీలు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్అధికారుల టీమ్ మాత్రమే కరెక్ట్‌గా సర్వే చేస్తోందని, మిగిలిన టీమ్‌లు తప్పులతడకగా వెరిఫికేషన్ చేస్తున్నాయంటూ పై ఆఫీసర్లను తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెరిఫికేషన్ అయిన వాటిలోనూ కలెక్టర్‌కు రెకమండ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు జీవో 58 కింద 614, జీవో 59 కింద ఈ ఏడాది వచ్చిన దరఖాస్తుల్లో 897, గతేడాది అప్లికేషన్లలో 357 రెకమండ్ చేశారు. ఇందులో కేవలం నస్పూర్‌కు సంబంధించిన 41 దరఖాస్తులను మాత్రమే అప్రూవల్ చేశారు.
నస్పూర్‌లో తక్కువ... బెల్లంపల్లిలో ఎక్కువ.....
జీవో 59 కింద స్లాబ్‌ల వారీగా భూముల రేట్ల నిర్ధారణలో సైతం లోపాలున్నట్టు తెలుస్తోంది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మార్కెట్ రేటు గజానికి రూ.10 వేల పైన ఉంది. ఇక్కడ గవర్నమెంట్ రేటు కేవలం రూ.1500 నుంచి రూ.2వేల లోపు నిర్ధారించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాల్లో మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎక్కువగా నిర్ధారించడం గమనార్హం. ఇక్కడ కొన్ని చోట్ల గజానికి ఏకంగా రూ.6వేలకు పైగా నిర్ధారించారు. దీంతో రూ.లక్షల్లో రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడంతో పాటు ఖజానా నింపుకోవడానికి ఈ స్కీమ్‌ను తీసుకొచ్చినప్పటికీ అధికారుల తీరుతో ఆ లక్ష్యం నెరవేరడం లేదని విమర్శలు వస్తున్నాయి.