- భూముల పరిరక్షణకు సర్కారు చర్యలు
- శాటిలైట్ ద్వారా రోజువారి ఫొటోలు
- ఆక్రమణలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వర్సిటీకి జియో ఫెన్సింగ్ చేయించాలని నిర్ణయించింది. దీని ద్వారా వర్సిటీ బౌండరీలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనికోసం ఇస్రోతో వర్సిటీ చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నది.
హైదరాబాద్ సిటీలో ఓయూ, దాని అనుబంధ కాలేజీలకు వందలాది ఎకరాల భూమి ఉంది. వర్సిటీ మెయిన్ క్యాంపస్ కే 1,600 ఎకరాల భూమి ఉండగా.. అందులో కొంత ఆక్రమణలకు గురైంది. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తరచూ ఆందోళనలు చేస్తున్నాయి. భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు.
వర్సిటీ భూములు ప్రైమ్ ఏరియాలో ఉండటంతో వాటిని పరిరక్షించడం వర్సిటీ అధికారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వర్సిటీ ల్యాండ్ రక్షణ కోసం టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం ఇస్రో అనుబంధ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో జియో ఫెన్సింగ్ చేయించేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే ఇస్రో అధికారులతో ఓయూ అధికారులు చర్చలు కూడా చేశారు. త్వరలోనే ఎంఓయూ కుదరనున్నది. ఓయూ క్యాంపస్ తో పాటు దాని అనుబంధ అటానమస్ కాలేజీల భూములతోపాటు ఇతర ప్రాంతాల్లోని వర్సిటీ భూములకూ ఫెన్సింగ్ చేయించనున్నారు.
వర్సిటికీ డిజిటల్ బౌండరీ..
ఓయూ అధికారులు ఇచ్చే అధికారిక భూముల వివరాల ఆధారంగా వర్సిటీకి డిజిటల్ బౌండరీలు రానున్నాయి. శాటిలైల్ ద్వారా జీపీఎస్ కోఆర్డినేషన్ తో వర్సిటీ బార్డర్ లైన్ ఇవ్వనున్నారు. దీంట్లో ఇప్పటికే ఆక్రమణలో ఉన్న భూముల వివరాలనూ పొందుపర్చనున్నారు. అయితే, ఇతరుల ఆక్రమణలో ఉన్నవి.. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు రెడ్ మ్యాప్ (ప్రత్యేకంగా కనిపించేలా) వేయనున్నారు. గూగుల్ ద్వారా యూనివర్సిటీ భూములను ఈజీగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇస్రో తయారుచేసిన కార్టోశాట్–3 శాటిలైట్ ద్వారా రోజువారి ఫొటోలనూ తీసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ పరిధిలోని భూమిపై కనిపించే చిన్న వస్తువులనూ గుర్తించేంత హై రిజల్యూషన్ ఫొటోలనూ ఆ శాటిలైట్ తీయనున్నది. దీంతో ప్రతి వారంరోజులకోసారి వర్సిటీని పరిశీలించినా.. ఆక్రమణలను ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. తద్వారా కబ్జాలకు చెక్ పెట్టొచ్చని సర్కారు భావిస్తోంది.
ఇస్రోతో త్వరలోనే ఎంఓయూ
యూనివర్సిటీ ల్యాండ్స్‌ను రక్షించేందుకు జియో ఫెన్సింగ్ కోసం ఇప్పటికే ఇస్రో అధికారులతో ప్రైమరీ చర్చలు జరిగాయి. ఎంఓయూ చేసుకోవాలని అనుకున్నం. జియో ఫెన్సింగ్ ద్వారా వర్సిటీ బౌండరీలను ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని వర్సిటీ పరిధిలోని భూములన్నింటికీ జియో ఫెన్షింగ్ చేయించాలని నిర్ణయించాం.
- ప్రొ. లక్ష్మీనారాయణ, ఓయూ రిజిస్ట్రార్