స్పీడ్‌గా జీఐఎస్​ సర్వే .. ఆరునెలల్లో కంప్లీట్‌కు జీహెచ్ఎంసీ కసరత్తు

స్పీడ్‌గా జీఐఎస్​ సర్వే .. ఆరునెలల్లో కంప్లీట్‌కు జీహెచ్ఎంసీ కసరత్తు
  •  సిటీలో డోర్ టూ డోర్ సర్వీసులకు క్యూఆర్ కోడ్
  • ముందుగా పైలట్ ప్రాజెక్టు సర్కిళ్లలో సర్వే  
  • అక్టోబర్ 2 నాటికి సేవలు అందేలా చర్యలు 

 హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ చేపట్టిన జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్​) సర్వే స్పీడ్ గా కొనసాగుతోంది. సిటీలో అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్ మెంట్ సేవలు మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ, ప్రైవేటు సేవలు డోర్ టూ డోర్  డైరెక్ట్ గా చేరవేసేందుకు ఆస్తులు, యుటిలిటీస్ మ్యాపింగ్ సర్వేను బల్దియా అధికారులు చేపట్టారు. ఇప్పటికే  ఫస్ట్ ఫేజ్ లో భాగంగా కొన్ని సర్కిళ్లలో డ్రోన్ ద్వారా సర్వే చేశారు.  

మరో ఆరు సర్కిళ్లలో డోర్ టు డోర్ చేస్తుండగా.. ఇది అయ్యాక చివరి ఫేజ్ లో శాటిలైట్ సర్వే చేపడతారు. 18 నెలల్లో సర్వే కంప్లీట్ చేయాలనుకోగా.. అంతకు ముందులోపే చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 90 టీమ్ లు పని చేస్తుండగా,  ఒక్కో టీమ్ లో ఇద్దరు ఉన్నారు. టీమ్ లను 600కు పెంచి ఆరు నెలల్లోనే కంప్లీట్ చేస్తారు. 

డ్రోన్ల ద్వారా సర్వే చేసేందుకు రామచంద్రాపురం, పటాన్ చెరువు, మియాపూర్ సర్కిళ్లు, డోర్ టు డోర్ సర్వేకు హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్ సర్కిళ్లను పైలట్ ప్రాజెక్ట్ లుగా ఎంపిక చేసుకుని అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 200 చదరపు కిలోమీటర్లకిపైగా డ్రోన్ సర్వే పూర్తి చేశారు.  త్వరలోనే 1.30 లక్షల ప్లాట్స్ డిజిటలైజ్ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. 

అక్టోబర్ లో అందుబాటులోకి సేవలు 

వచ్చే అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి పైలట్ ప్రాజెక్టు సర్కిళ్లలో జీఐఎస్​ మూడు వితలుగా సర్వే పూర్తి చేస్తారు. ఆయా కాలనీల్లోని ఇండ్లకు యూనిక్ ఐడీ నంబర్లు (క్యూఆర్ కోడ్) జారీ చేస్తారు. వాటి ఆధారంగా సేవలను అందించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుంది. ఒకే కోడ్ తో అన్నిరకాల సేవలను అందించి, వచ్చే  ఫలితాలను బట్టి  గ్రేటర్ అంతటా విస్తరించేందుకు బల్దియా చర్యలు తీసుకుంటుంది. 

ఒకే కోడ్ తో ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటికే చేరవేస్తారు. క్యాబ్, ఫుడ్ సేవలతో పాటు ఆన్ లైన్ లో ఏదైనా బుక్ చేసినా కూడా డైరెక్ట్ గా వచ్చేలా యూనిక్ కోడ్ ఉండనుంది. ప్రభుత్వ సేవలకు కూడా అదే కోడ్ ద్వారా అందిస్తారు. ఇంట్లో చెత్త తీసుకెళ్లకపోయినా, నీళ్లు రాకపోయినా.. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇదే కోడ్ పరిగణలోకి తీసుకుంటారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సర్కిళ్లలో  ముందుగా సేవలను అందించేందుకు బల్దియా తీవ్రంగా శ్రమిస్తుంది.  

కమిషనర్ క్లారిటీతో సర్వే స్పీడప్  

జీఐఎస్ సర్వే మొదలుకాక ముందే ప్రజల్లోకి నెగెటివ్ ప్రచారం వెళ్లింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సర్వేకు సహకరించలేదు. ప్రధానంగా సర్వే అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుందనే ప్రచారం పెద్దఎత్తున జరగడంతో వ్యతిరేకత వచ్చింది. అధికారులు కూడా వివిధ ఆధార పత్రాలను చూపాల ని ప్రజలను కోరడంతో అడ్డు చెప్పారు. దీంతో సర్వేపై కమిషనర్ ఆమ్రపాలి క్లారిటీ ఇచ్చారు. 

ట్యాక్స్ పెంచేందుకు చేస్తున్న సర్వే కాదని, ఎలాంటి ఆధార పత్రాలు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. బల్దియా సేవలను మరింత చేరువ చేసేందుకే సర్వే చేస్తున్నామని వివరించారు. ఆ తర్వాత సర్వేకు చిక్కులు తొలగాయి.  ప్రజలు కూడా మద్దతు ఇస్తుండగా ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతోంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సిటీలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమా రు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో కమర్షియల్ భవనాలు 2.7 లక్షలు ఉన్నాయి.