ఐలాండ్స్ విజిట్ చేయాలనుకోవడం ఒక విధంగా సాహసమే. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడు? ఎలా మారుతుందో చెప్పలేం. అలాంటిది అక్కడే ఉండేవాళ్లను చూస్తే ‘వీళ్లు ఎలా మేనేజ్ చేస్తున్నారా’ అనిపించకమానదు. అలాంటి వాటిల్లో అతి పెద్ద, అందమైన అగ్నిపర్వత ప్రదేశం ట్రిస్టాన డా కున్హా. ఇది దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న సెయింట్ హెలెనాలోని ఐలాండ్ సమూహం. ఈ మధ్య శాటిలైట్ ద్వారా తీసిన ఈ దీవి ఫొటోలను నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పట్నించీ దీని వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఆ దీవి గురించి కొన్ని స్పెషల్ సంగతులు ఇవి...
ట్రిస్టనా డా కున్హా ఐలాండ్ దక్షిణాఫ్రికాలో ఉందన్నమాటే కానీ.. దానికి దాదాపు 2,700 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాదు.. ఇది దక్షిణ అమెరికా సముద్ర తీరానికి 3,700 కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలంటే సముద్ర ప్రయాణం చేయాల్సిందే. విమాన, రోడ్డు, రైలు మార్గాలు ఏవీ ఉండవు. సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఆరు రోజుల ప్రయాణం ఉంటుంది. అంతేకాదు.. ఎలాగైతే వెళ్తారో అదే దారిలో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ ఐలాండ్ చూద్దామని వెళ్లే టూరిస్ట్‌ల కోసం గైడ్ సర్వీస్ కూడా ఉంది.
ఈ పేరెలా వచ్చిందంటే..
ఈ ఐలాండ్స్‌ను పోర్చుగీస్ నావికుడు ట్రిస్టావో డా కున్హా 1506వ సంవత్సరంలో కనుగొన్నాడు. కాకపోతే వాతావరణం బాగాలేకపోవడంతో అతను అక్కడ కాలుపెట్టలేకపోయాడు. తర్వాత అతనే మెయిన్ ఐలాండ్‌కు ‘ఇల్హా డె ట్రిస్టియో డా కున్హా’ అని పేరు పెట్టాడు. వాడుకలో అది కాస్తా ట్రిస్టనా డా కున్హా ఐలాండ్‌గా మారింది.
బ్రిటిష్ వాళ్లే మొదటి నివాసితులు
1816లో బ్రిటిష్ సైనికులు, కొందరు ప్రజలు ఈ ఐలాండ్‌కు వలస వెళ్లారు. వాళ్లలో ఆడవాళ్లు, పిల్లలు కూడా ఉన్నారు. సెయింట్ హెలెనాలో నెపోలియన్ బోనపార్టెను వ్యతిరేకిస్తూ వాళ్లు ఆ దీవికి వెళ్లారు. పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డాక కొందరు అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు. 2018 నాటికి అక్కడ 250 మంది శాశ్వత నివాసితులుగా ఉన్నారు. వాళ్లకు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ సిటిజన్ షిప్ ఉంది. 2016లో 293 మంది అక్కడ నివసించేవారట. తర్వాత ఆ సంఖ్య 250కి చేరింది. అయితే 2023, జూలై 7న విడుదలైన డాటా ప్రకారం అక్కడ 234 మంది ఉన్నారు. వాళ్లు కాకుండా అక్కడ మరో 23 మంది ఉన్నారు. ఈ దీవికి అందం దాని చుట్టూ ఉన్న సముద్రమే. అక్కడ 11 ఇంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అవేంటంటే.. కొలిన్స్, గ్లాస్, గ్రీన్, హగన్, లావరెల్లో, రెపెట్టొ, రొగర్స్, స్కిబ్, స్వైన్....
ఇండియాతో సంబంధం?!
ట్రిస్టనా డా కున్హా ఐలాండ్‌కి మనదేశంతో ఒక కనెక్షన్ ఉంది! అదేంటంటే.. 1643, ఫిబ్రవరి 7న, మొదటిసారి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్ ‘హీమ్‌స్టెడ్’కు చెందిన టీం ఆ నేలపై కాలు మోపారు. ఆ తర్వాత పాతికేండ్లకు డచ్ వాళ్లు నాలుగు సార్లు ఆ ప్రదేశానికి వెళ్లారు. వాళ్లే బ్రిటిష్ ఇండియా కంటే ముందు మనదేశంలోకి వచ్చిన డచ్ దేశీయులు.1656లో మొదటిసారి ఆ ప్రదేశం గురించి చార్టులు తయారుచేశారు.
వైల్డ్ లైఫ్
ఇక్కడ నీలం రంగులో ఉండే సొర చేపలు, ఏడు మొప్పలు కలిగిన షార్క్‌లు, తిమింగలాలు, షార్ట్ ఫిన్ మాకొ షార్క్స్, హంప్ బ్యాక్ వేల్స్, స్పెర్మ్ వేల్స్, డాల్ఫిన్స్, ఎలిఫెంట్ సీల్స్, ఫిన్ వేల్స్, అల్బాట్రొస్లతో పాటు.. రెండు లక్షలకుపైగా రాక్ హొపర్ పెంగ్విన్లు, ఐదు మిలియన్లకు పైగా షీర్ వాటర్స్ ఉంటాయి. అంతేకాకుండా మూడు లక్షలకు పైగా సబ్ – అంటార్కిటిక్ ఫర్ సీల్స్ ఉంటాయి. వీటితోపాటు సముద్ర పక్షులు కూడా సందడి చేస్తాయి.
పచ్చదనానికి కారణం అదే...
నీటి అడుగున ఉండే అడవుల్లో పెద్ద కెల్ప్ అనే సముద్ర గడ్డి లేదా ఆల్గే ఉంటుంది. ఇది ఈ దీవి చుట్టూ ఉంది. శాస్త్రీయంగా దీన్ని మ్యాక్రోసిస్టిస్ పెరిఫెరా అంటారు. ఇది భూగ్రహం మీదే అత్యంత వేగంగా పెరిగే సీవీడ్. దీనికారణంగా ఆ దీవి ఎప్పుడూ పచ్చగా కనపడుతుంది. అంతెందుకు.. ఇటీవల నాసా వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో నీలిరంగు సముద్రంలో ఆకుపచ్చని ఈ దీవులు ఆకర్షణీయంగా కనిపించాయి. శాటిలైట్ ద్వారా మే 24, 2023 తీసిన మొదటి ఫొటో ఈ దీవిదే. ఆ ఫొటోలను నాసా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ ఐలాండ్.
అన్ని టెన్షన్స్ వదిలేసుకుని దూరంగా ఆ దీవికి వెళ్లిపోతే బాగుండు అనుకుంటున్నారా? ఆ దీవికి ఇమ్మిగ్రేట్ కావాలంటే అక్కడ ఉండే కుటుంబాల్లో ఎవరో ఒకరితో బంధుత్వం ఉండాలి. లేకపోతే అక్కడ ఉండేందుకు నో ఛాన్స్. జస్ట్ విజిట్ చేసేందుకు అయితే ఓకే.
ఇక్కడ లోకల్ కరెన్సీ యూకె పౌండ్. క్రెడిట్ కార్డ్స్, చెక్‌లు యాక్సెప్ట్ చేయరు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోని ట్రెజరీలో యూరో, డాలర్స్, ర్యాండ్ వంటి కరెన్సీలను మార్చుకోవచ్చు.
ఇంగ్లిష్ మాట్లాడతారు. కాకపోతే, రకరకాల భాషలకు సంబంధించిన పదాలు కూడా మిక్స్ అయి ఉంటాయి. కానీ, టూరిస్ట్‌లకు సులభంగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్రిటిష్ యాస ఎక్కువ.
ఈ ఐలాండ్‌లో నివసించే ప్రజలు ఆహారంగా దుంపలు, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పెంగ్విన్ మాంసం తింటారు. యాపిల్స్, పీచ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. అన్నింటికంటే బంగాళా దుంపలు ఎక్కువగా పండిస్తారు. వాటితో రకరకాల వంటలు చేసుకుని తింటుంటారు.
ఈ దీవిలో వాతావరణం చాలా త్వరగా మారిపోతుంటుంది. అందుకే టూరిస్ట్‌లు వాతావరణం మీద ఆధారపడి వాళ్ల ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం గురించి పక్కన పెడితే.. ఆతిథ్యం చాలా బాగుంటుందని ఈ దీవిని సందర్శించిన వాళ్లు చెప్తారు.
టూరిస్ట్‌లు కెమెరా బయటకు తీసి క్లిక్ చేద్దామని ట్రై చేస్తే అక్కడి ప్రజలు ముఖాలు చూపించేందుకు ఇష్టపడరు. అందుకే ఇంటర్నెట్లో అక్కడ నివసించే స్థానికుల ఫొటోలు ఎక్కువగా కనిపించవు.
ప్రజల జీవనాధారం వ్యవసాయం, చేపలు పట్టడం, పండించిన వాటిని షిప్ ద్వారా నగరాలకు పంపించి డబ్బు సంపాదిస్తారు. అలాగే అక్కడి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు.
ఇక్కడ ఉండే పెంగ్విన్లు చాలా ప్రత్యేకమైనవి. వాటిని రాక్ హొపర్ పెంగ్విన్లు అంటారు. అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గుంపులుగా వెళ్తాయి. మామూలు పెంగ్విన్ల కంటే భిన్నంగా ఉంటాయి. చాలా చురుకైనవి. పెంగ్విన్ల జాతిలో ఇవి చాలా చిన్నవి.