ఎస్ఎల్​బీసీ టన్నెల్​లోకి జియోలాజికల్ సర్వే టీమ్..మట్టి నమూనాల సేకరణ

 ఎస్ఎల్​బీసీ టన్నెల్​లోకి జియోలాజికల్ సర్వే టీమ్..మట్టి నమూనాల సేకరణ
  • నీటి ప్రవాహంపై అధ్యయనం
  • తవ్వకాల్లో కీలకంగా మారుతున్న ఎస్కవేటర్లు

నాగర్​ కర్నూల్/అచ్చంపేట,వెలుగు: ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో చివరి పాయింట్​కు చేరుకున్న జియోలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా టీమ్​ సభ్యులు మంగళవారం 13.600 కిలోమీటర్ల నుంచి 13.900 కిలోమీటర్ల వరకు సర్వే నిర్వహించారు. మట్టి నమూనాలు సేకరించడంతో పాటు నీటి ప్రవాహంపై అధ్యయనం చేశారు. ప్రమాదం జరగకుండా సింగరేణి టీమ్స్​ దుంగలతో ఎనిమిది చోట్ల కాగ్స్​ ఏర్పాటు చేశారు.

మట్టి, రాళ్లు తొలగించడంలో ఎస్కవేటర్లు, జేసీబీలు కీలకంగా మారుతున్నాయి. టీబీఎం ప్లాట్​ఫాంతో పాటు 65 మీటర్ల టెయిల్​ ఎండ్  భాగాన్ని కట్​ చేశారు. డి1, డి2, ఎ5 ప్రాంతాలు, టీబీఎం చుట్టుపక్కల సింగరేణి, ర్యాట్​ హోల్​ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్​ సభ్యులు మట్టిని తవ్వుతున్నారు.​ నీళ్లను తోడేసేందుకు ఎక్కడికక్కడ జెట్  మోటార్లు ఏర్పాటు చేశారు.

​కేరళ క్యాడవర్  డాగ్​ స్క్వాడ్​ మంగళవారం టన్నెల్​లో సెర్చ్​ ఆపరేషన్​లో పాల్గొన్నాయి. జీఎస్ఐ ఆఫీసర్లు14 కిలోమీటర్ల టన్నెల్​ పైభాగంలోని నల్లమల అటవీప్రాంతంలో సర్వే నిర్వహించారు. టన్నెల్ లోకి గ్రౌండ్​ వాటర్​తో పాటు పైనుంచి నీళ్లు వస్తున్నాయా? అనే అంశంపై ఫోకస్​ చేశారు.

టన్నెల్​లోకి వెళ్లిన జీఎస్ఐ టీమ్​ టన్నెల్​ నిర్మాణం, భూమి పొరల్లో మార్పులు, టన్నెట్​ లోపల మట్టి ఘన స్థితి, నీటి ప్రవాహం ప్రభావంపై విశ్లేషించారు. ఈ టీమ్  అధ్యయనం అనంతరం రెస్క్యూ ఆపరేషన్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మరింత ఎఫెక్టివ్​గా పని చేసేందుకు పలు సూచనలు చేశారు.

మెషీన్లతో పనులు..

డిజాస్టర్​ మేనేజ్​మెట్​ స్పెషల్​ చీఫ్​ సెకరెట్రీ అర్వింద్​కుమార్, కలెక్టర్​ బదావత్​ సంతోష్, ఎస్పీ వైభవ్​ గైక్వాడ్​ రఘునాథ్​ తదితరులు రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొంటున్న వివిధ సంస్థల ప్రతినిధులు, ఇంజినీర్లు, జియోలాజిస్టులతో చర్చించారు. రిస్క్​ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెషినరీతో పని చేయించాలని నిర్ణయించారు. హిటాచీ, ఎస్కవేటర్లు, జేసీబీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

జీఎస్ఐ, సిస్మాలజీ, ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ల అధికారులు రెస్క్యూ ఆపరేషన్​ ప్లానింగ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్  మెషీన్లు, సెన్సార్లు వినియోగిస్తున్నారు. టీబీఎం ప్లాట్​ఫాం తొలగించి డి1, డి2, ఎ5 ప్రాంతాల్లో మట్టిని తవ్వితే మృతదేహాల ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉంటుందన్న అంచనాతో మెషినరీల సంఖ్య పెంచుతున్నారు. ర్యాట్​ హోల్​ మైనర్ల టీం టన్నెల్​ చివరి భాగంలో 13.900 కిలోమీటర్ల వద్దకు చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు లాస్ట్​ పాయింట్​లో వాటర్  ప్రెషర్​ను పరిశీలించాయి.