ఏజెన్సీ లో విదేశీ బృందం పర్యటన

జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో మంగళవారం జర్మనీ, నెదర్లాండ్​ దేశస్తులు పర్యటించి సందడి చేశారు. చేతన ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్గానిక్ పత్తి సాగు పరిశీలించేందుకు మొత్తం 15 మంది విదేశీయులు ముందుగా సిర్పూర్ యు మండలం ముంజిగుడా గ్రామాన్ని సందర్శించారు.  గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పత్తి ఏరుతూ రైతులు, కూలీలతో ముచ్చటించారు. 

600 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు పంపిణీ

అనంతరం జైనూర్ లోని రాసిమెట్ట ఆశ్రమ స్కూల్ లో ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొత్తం 600 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిళ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అనంతరం గోండి కోలాం, లంబాడి నృత్య ప్రదర్శనలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. తమ దేశ బాషలోని పాటపై విద్యార్థులకు డాన్స్ నేర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో నందకుమార్, సీనియర్ మేనేజర్, శ్రీకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ప్రభాకర్, ఐసీఎస్ మేనేజర్ ముజీబ్, కోఆర్డినేటర్ సుశీల, నగేశ్, రాము, రాసిమెట్ట స్కూల్ హెచ్ఎం అనిత  పాల్గొన్నారు.

కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం మంగళవారం కావడంతో అంజన్న భక్తులు తెల్లవారుజాము నుంచే గుట్టకు చేరుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్​ హరిహరనాథ్, సునీల్   భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని ఆల్ఫోర్స్  విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్  నాయకుడు ఓరుగంటి రమణారావు తదితరులు దర్శించుకున్నారు.