- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని స్పీకర్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీని గురువారం జర్మనీ ఎంపీల బృందం సందర్శించింది. జర్మనీలోని రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్ర్డిక్ హేరింగ్ నాయకత్వం లోని ఎనిమిది మంది సభ్యులకు మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీకాంతరావులు, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు స్వాగతం పలికారు. రాష్ర్ట ఏర్పాటు, అభివృద్ధి, అసెంబ్లీ, కౌన్సిల్ జరుగుతున్న తీరును ఎంపీల బృందానికి స్పీకర్, చైర్మన్ వివరించారు.
అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నతమైనవని, పదేళ్ల క్రితం ఏర్పడిన కొత్త రాష్ర్టం అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళుతోందన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధిక ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. నిజాం హయంలో నిర్మించిన పాత అసెంబ్లీ భవనాన్ని రూ. 49 కోట్లతో ఆధునికీకరణ చేస్తున్నామని.. త్వరలోనే శాసనమండలిని అందులోకి మార్చుతామని గుత్తా వివరించారు. తెలంగాణ పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ అని, పెట్టుబడులు పెట్టాలని రెనిలాండ్ ఎంపీలను స్పీకర్, కౌన్సిల్ చైర్మన్లు కోరారు.ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహాకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.