సోలార్ హబ్ గా రాజన్న జిల్లా .. పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆసక్తి

సోలార్ హబ్ గా రాజన్న జిల్లా .. పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆసక్తి
  • వ్యవసాయ రంగంలోనూ ఏఐ టెక్నాలజీ
  • పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా వేములవాడ 
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించిన జర్మనీ బృందం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా సోలార్‌‌‌‌ హబ్‌‌గా మారనుంది. సహకార విద్యుత్​ సరఫరా సంస్థ (సెస్) ఆధ్వర్యంలో సోలార్​ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు జర్మనీ కోఆపరేటివ్ బ్యాంకు ముందుకువచ్చింది. ఈ మేరకు తెలంగాణలో జర్మనీ బృందం శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించింది. సెస్‌‌ పాలకవర్గంతో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జర్మనీ కోఆపరేటివ్‌‌ బ్యాంకు సంయుక్తంగా ఈ ప్లాంట్‌‌ ఏర్పాటుకు నిధులు సమకూర్చనున్నాయి. 

సెస్‌‌ పరిధిలో సోలార్‌‌‌‌ వెలుగులు 

ఈ ప్రాజెక్ట్‌‌ అనుకున్నట్లుగా కార్యరూపం దాలిస్తే సెస్ పరిధిలోని రాజన్నసిరిసిల్ల అంతా సోలార్‌‌‌‌ హబ్‌‌గా మారనుంది. బృందంలోని జర్మనీ అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంస్థ అధిపతి స్వెన్ గెల్హార్, జర్మనీ వ్యవసాయ శాఖ ఆసియా హెడ్‌‌ రెబాక్క, ఫ్రాన్ హోపర్, సంస్థ ప్రతినిధులు రఘు చలిగంటి, సెబాస్టియన్, మార్టిన్‌‌ జిల్లాలో పర్యటించారు. అనంతరం సెస్‌‌ పాలకవర్గంతో ఆఫీస్‌‌లో సమావేశమయ్యారు. సెస్‌‌ పరిధిలోని విద్యుత్ కనెక్షన్ లు, వినియోగదారులకు విద్యుత్ సప్లై చేస్తున్న తీరును స్టడీ చేశారు. అనంతరం పలు సబ్ స్టేషన్లను పరిశీలించారు. దీనిపై ఓ నివేదిక తయారుచేయించి ఈ పథకంపై ముందుకు పోయే అవకాశమున్నట్లు సెస్‌‌ వర్గాలు తెలిపాయి. 

సోలార్ పవర్ ప్రాజెక్ట్‌‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 60 శాతం, జర్మనీ వ్యవసాయ సహకార సంస్థ 40 శాతం పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జర్మనీ బృందం తెలిపింది. దీనిపై సెస్‌‌ చైర్మన్‌‌ చొక్కాల రామారావు మాట్లాడుతూ సెస్ పరిధిలో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు జర్మనీ కో ఆపరేటివ్ సంస్థ ముందుకు రావడం హర్షనీయమన్నారు. ప్రాజెక్ట్ కోసం పెద్దూర్ గ్రామంలోని 220 కేవీ సబ్ స్టేషన్ జర్మనీ బృందం పరిశీలించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే సిరిసిల్లలో సోలార్ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు.

వేములవాడలో అక్రాట్ పైలట్ ప్రాజెక్ట్

జర్మనీ ప్రభుత్వం వ్యవసాయ, ఆహార శాఖ సహకారంతో వ్యవసాయంలో ఏఐ వినియోగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పంట దిగుబడుల పెంపుతోపాటు పెట్టుబడి తగ్గించేందుకు ఏఐని ఉపయోగించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కూలీల వినియోగం తగ్గించడం, డ్రోన్ల సాయంతో భూసార పరిశీలన.. వంటి వాటిలో ఏఐని వినియోగించనున్నారు. దీనికోసం అక్రాట్‌‌ పేరిట వేములవాడను పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా ఎంపిక చేయనున్నట్లు జర్మనీ బృందం తెలిపింది. 

అక్రాట్ పైలట్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు జర్మనీ బృందం తెలిపింది. రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు అందడంలేదని, భూసారం, పంటను బట్టి ఫెస్టిసైడ్స్‌‌ వాడకంపై సరైన అవగాహన కల్పిస్తే వ్యవసాయంలో అధిక దిగుబడులు రాబట్టవచ్చని జర్మనీ బృందం వెల్లడించారు. ఈ మేరకు వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మామిడిపల్లి, నాగారం గ్రామాల్లో పర్యటించారు. పంటపొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.