గ్రీన్ కొలువులు సాధ్యమే

ప్రపంచంలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 70 శాతం వాటా ఇండియా, చైనా, అమెరికా, ఆస్ట్రేలియాలదే. ఈ నాలుగు దేశాలతోపాటు గ్లోబల్​గా​ కోల్​ మైనింగ్​లో 70 లక్షల మందికిపైగా డైరెక్ట్​గా ఉపాధి పొందుతున్నారు. ఇన్​డైరెక్ట్​గా మరికొన్ని లక్షల మంది దానిపై ఆధారపడి బతుకుతున్నారు. అయితే.. క్లైమేట్​ ఛేంజ్​ సమస్య పరిష్కారానికి కోల్​ ప్రొడక్షన్​ని రోజురోజుకీ తగ్గించాలని చాలా స్టడీలు సూచిస్తున్నాయి. కానీ.. అవి చెప్పినట్లు చేయాలంటే కొత్త సవాళ్లు పుట్టుకొస్తాయి. ఆ ఛాలెంజ్​లను దాటుకొనిపోవటం అంత ఈజీ కాదు.

ఉద్యోగాలు మొదటి సమస్య

బొగ్గు అవసరాలను తీర్చగలిగేది రెన్యూవబుల్ ఎనర్జీయే అనటంలో ఎలాంటి డౌట్​ లేదు. ఈ ఆల్టర్నేటివ్​ పవర్​ సెక్టార్​లో సోలార్​, విండ్​లు ప్రధానమైనవి. రెన్యూవబుల్​ పవర్​ ఫీల్డ్​ కల్పిస్తున్న మొత్తం ఉద్యోగాల్లో సగానికిపైగా జాబులు ఈ రెండు రంగాల్లోనే లభిస్తున్నాయి. కోల్​ బేస్డ్​ పవర్​ ప్రాజెక్టులను మూసేయాలని క్లైమేట్​ అగ్రిమెంట్లు కూడా మేజర్​ టార్గెట్లుగా పెట్టుకున్నాయి. బొగ్గు తవ్వకాలకు తెర దించితే బతుకు దెరువు కోల్పోయేవారి సంఖ్య ఎక్కువ. ఆ రేంజ్​లో సోలార్​, విండ్​ పవర్​ ప్లాంట్లలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు.

గ్లోబల్​ యావరేజ్​ టెంపరేచర్​ పెరగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రి–ఇండస్ట్రియల్​ లెవెల్స్​తో పోల్చితే రెండు డిగ్రీల సెంటిగ్రేడ్​ లోపే ఉండేట్లు చూస్తామని ప్రపంచ దేశాలు ‘2015 పారిస్​ అగ్రిమెంట్’​లో మాటిచ్చాయి. టెంపరేచర్​ పెరుగుదలని 1.5 డిగ్రీల సెల్సియస్​కే పరిమితం చేయటానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తామన్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే గ్లోబల్​ ఎనర్జీ సప్లయిలో బొగ్గు వాటాను 2050 నాటికి 73–97 శాతం మధ్య ఉంచాలి. కోల్​ మైనింగ్​కి దాదాపు ఫుల్​స్టాప్​ పెట్టాలి. ఇదే జరిగితే కార్మికుల ఉపాధి పోతుంది.

రిసోర్సులు రెండో సమస్య

వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి బయటపడటానికి బొగ్గు తవ్వకాన్ని, వాడకాన్ని వదిలేసి సోలార్, విండ్​ పవర్​లను ఉత్పత్తి చేయాలన్నా అందుకు తగ్గట్లు వనరులు ఉండాలి. కోల్​ మైనింగ్​ ఏరియాల్లోనే సోలార్​, పవర్​ ప్లాంట్లను ఏర్పాటు చేయటానికి ఆయా ప్రాంతాలన్నీ అనుకూలంగా లేవు. రిసోర్సులు లేకపోవటం వల్ల రెనివబుల్​ ఎనర్జీ ప్రొడక్షన్​ అటు టెక్నికల్​గా, ఇటు ఎకనామికల్​గా లాభదాయకం కావు. కోల్​ మైనింగ్​ని రిప్లేస్​ చేయటానికి విండ్​ పవర్​ సెక్టార్​ కన్నా సోలార్​ పవర్​ ప్రాజెక్టులే బెటర్​ అనేది అందరికీ తెలిసిందే.

చైనాలో 29 శాతం కోల్​ మైనింగ్​ ఏరియాలే సోలార్​ పవర్​ ప్రొడక్షన్​కి సూటబుల్​. ఇండియా, ఆస్ట్రేలియాల్లో బొగ్గు తవ్వకాలు జరిగే అన్ని ప్రాంతాలూ అనుకూలమే. అమెరికాలో సుమారు 62 శాతం కోల్​ మైనింగ్​ ఏరియాలు సోలార్​ పవర్​కి సరిపోతున్నాయి. దీన్నిబట్టి 4 దేశాల్లోనూ విండ్​ పవర్​కి ఎదురుగాలి వీస్తున్నట్లు అర్థమవుతోంది. మొత్తమ్మీద విండ్​ పవర్​కి 7 శాతం లోపు బొగ్గు గనుల ప్రాంతాలు; విండ్, సోలార్​ పవర్ జనరేషన్​కి ఉమ్మడిగా ఐదు శాతం లోపు ప్రాంతాలే అందుబాటులో ఉన్నట్లు స్టడీలు వివరిస్తున్నాయి.

సర్కార్లు తలచుకుంటే సాధ్యమేనట!

గ్లోబల్​ వార్మింగ్​ కట్టడికి అన్ని దేశాలు కట్టుబడి ఉంటే గ్రీన్​ జాబ్స్​ (సోలార్​, విండ్​ పవర్​ సెక్టార్లలో ఉద్యోగాలు) సాధ్యమేనని అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వాలు తలచుకుంటే ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి రెన్యూవబుల్​ ఎనర్జీ రంగంలో 2 కోట్ల 40 లక్షల కొలువుల సృష్టి కష్టం కాదని ఇంటర్నేషనల్​ లేబర్​ ఆర్గనైజేషన్​ అభిప్రాయపడుతోంది. సోలార్​, విండ్​ పవర్​లను పూర్తిగా వాడుకుంటే 2050 నాటికి ఈ రంగాల్లో 4 కోట్లకు పైగా జాబులొస్తాయని ఇంటర్నేషనల్​ రెన్యూవబుల్​ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేస్తోంది.

 మన దేశంలో పరిస్థితేంటి?

దేశంలో కోల్​ మైనింగ్​ని క్లోజ్​ చేస్తే పవర్​​ సప్లయి–డిమాండ్ మధ్య భారీ లోటు ఏర్పడుతుంది. దీని భర్తీకి ప్రస్తుత సోలార్​ కెపాసిటీని సుమారు 30 రెట్లు (వెయ్యి గిగా వాట్లకు) పెంచాలి. అంత చేసినా బొగ్గు గనులపై డైరెక్ట్​గా, ఇన్​డైరెక్ట్​గా ఆధారపడ్డ 10 లక్షల మందిలో సగం మందికే జాబులొస్తాయి. మిగతా 5 లక్షల మంది చేతులు ముడుచుకుని ఖాళీగా కూర్చోవాలి. దేశంలోని మొత్తం 500 బొగ్గు గనుల్లో ఏటా 70  కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తి జరుగుతోంది. అందులో 85 శాతం వాటా ఛత్తీస్​గఢ్​, జార్ఖండ్​, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్​లదే.

ఈ గనుల్లో పనిచేసేవారి సంఖ్య 4 లక్షల 85 వేలు. బొగ్గు గనులను మూసేస్తే అక్కడ ఉపాధి కోల్పోయే కార్మికులకు ఉద్యోగాలివ్వాలంటే ప్రతి సోలార్​ పవర్​ ప్లాంట్​నూ కనీసం రెండు గిగావాట్ల కెపాసిటీతో​ ఏర్పాటుచేయాలి. దేశంలోని మొత్తం ఇన్​స్టాల్డ్​ సోలార్​ కెపాసిటీ 33.73 గిగా వాట్లు. 2022 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్​(175 గిగా వాట్లు) చేరుకోవాలంటే ప్లాంట్ల ఏర్పాటుకు పెద్దఎత్తున భూములు సేకరించాలి. కోల్​ ఇండియా వద్ద ఉన్న భూములు చాలవు.