వరంగల్ జిల్లాలో పన్ను రాయితీపై ప్రచారం కరువు.. ఏప్రిల్ 30లోగా ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

వరంగల్ జిల్లాలో పన్ను రాయితీపై ప్రచారం కరువు.. ఏప్రిల్ 30లోగా ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ
  • మున్సిపాలిటీల్లో ఏప్రిల్ 30లోగా ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ
  • 15 రోజులు గడిచినా పన్ను చెల్లింపులు అంతంత మాత్రమే.. 
  • ప్రచారాన్ని ఫ్లెక్సీల ఏర్పాటుతోనే సరి పుచ్చుతున్న ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపు (ఎర్లీబర్డ్  స్కీమ్) లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 5 శాతం పన్ను రాయితీ ప్రకటిస్తూ, మున్సిపల్​ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2025_26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు వసూళ్లకు శ్రీకారం చుట్టింది. గతంలో బకాయిపడ్డ ఆస్తిపన్నుపై విధించిన వడ్డీని 90 శాతానికి తగ్గించి పన్నుల బకాయిలు వసూలు చేశారు. తాజాగా, ముందస్తు ఇంటి పన్నులను ఎర్లీబర్డ్  స్కీమ్ లో కనీసం 25 శాతం వరకు పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరియైన ప్రచారం లేకపోవడంతో పన్నుల వసూలు ముందుకు సాగడం లేదు.

ఎర్లీబర్డ్ స్కీమ్ కు అర్హులు.. 

2024_25 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలులేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన లబ్ధిదారులు ప్రస్తుతం ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీమ్​కు అర్హులు. రాయితీ పొందాలనుకునే వారు గతంలో పెండింగ్ ఆస్తిపన్ను బకాయిలుపూర్తిగా చెల్లించి, ఈ ఏడాదికి సంబంధించి ముందస్తుగా ఇంటి పన్నులు చెల్లించే వారికి రాయితీ వర్తిస్తుంది. ఈ ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఇంటి పన్నులకు ప్రతి నెలా 2 శాతం వడ్డీ విధిస్తూ, ప్రత్యేక సాప్ట్​వేర్​  ఏర్పాటు చేశారు.  

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని చోట్ల మున్సిపాలిటీ  సిబ్బందికి వేతనాలు సకాలంలో అందించలేని పరిస్థితి. దీనిని అధిగమించాలంటే పన్నుల వసూలే మార్గంగా మారనుంది. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును ప్రతి ఆరు నెలలకోసారి చెల్లించాలి. ఏటా పన్నులకు వడ్డీ చేరి పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోతున్నాయి. 

ఎర్లీబర్డ్  స్కీమ్​ను సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో ఇంటి పన్నుల చెల్లింపును ప్రోత్సహించడానికి ఎర్లీబర్డ్  స్కీమ్​ను ప్రవేశపెట్టింది. రెగ్యూలర్​గా పన్నులు చెల్లించే లబ్ధిదారులు ముందస్తుగా 2025_26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటిపన్ను ఏప్రిల్​30లోగా ముందస్తుగా చెల్లించడం ద్వారా ఇంటి పన్నులో 5 శాతం రాయితీ పొందవచ్చు. మున్సిపాలిటీ పరిధిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. వార్డుల్లో అవగాహన కల్పించాలని వార్డు ఆఫీసర్లను ఆదేశించాం. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.- రవీందర్​ ,మహబూబాబాద్​ మున్సిపల్​ కమీషనర్​