కంప్యూటర్ యూజర్లకు అలర్ట్.. ఇక విండోస్‌ 7 సేఫ్‌ కాదు

కంప్యూటర్ యూజర్లకు అలర్ట్.. ఇక విండోస్‌ 7 సేఫ్‌ కాదు
  • సెక్యూరిటీ అప్‌డేట్లను ఆపేస్తున్న మైక్రోసాఫ్ట్‌‌
  • వచ్చే ఏడాది జనవరి లోపు 10కు మారాలి
 

కంప్యూటర్‌ ఉందా? అందులో ఆపరేటింగ్‌ సిస్టం (ఓఎస్‌) విండోస్‌ 7 వాడుతున్నారా? అయితే, మార్చుకోవడం మంచిది. అప్‌ గ్రేడ్‌ చేసుకుంటే చాలా మేలు. ఎందుకంటే 2015లోనే విండోస్‌ 7కు గుడ్‌ బై చెప్పిన మైక్రోసాఫ్ట్‌‌.. వచ్చే ఏడాది జనవరి నాటికి విండోస్‌ 7తో పూర్తిగా బంధం తెంచుకోబోతోందట. ఇంట్లో కంప్యూటర్‌ వాడేవారికి ఎలాంటి సెక్యూరిటీ అప్‌ డేట్లను ఇవ్వదంట. అదే వ్యాపారం చేసుకునేవారికైతే సెక్యూరిటీ అప్‌ డేట్లు కావాలంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనట. కాబట్టి.. ఇంటి కంప్యూటర్లకు వైరస్‌ల బెడద పొంచి ఉంటుందని చెబుతున్నారు. హ్యాకర్లు తెగబడిపోయే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

నెట్‌ అప్లికేషన్స్‌‌ అనే అనలిటిక్స్‌‌ సంస్థ ప్రకారం… ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 42.8% కంప్యూటర్లలో వాడుతున్న ఓఎస్‌ విండోస్‌ 7. విండోస్‌ 10 సాఫ్ట్‌‌వేర్‌ను 45.5% కంప్యూటర్లలో ఇన్‌‌స్టాల్ చేసుకున్నారు. ఏడాదిలోపు విండోస్‌ 7 నుంచి విండోస్‌ 10కు అప్‌డేట్‌ అయితే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కనీసం కస్టమర్‌ సపోర్ట్‌‌ కూడా ఇవ్వబోమని సంస్థ తేల్చి చెబుతోంది. 2014లో విండోస్‌ 10ను ప్రవేశపెట్టినప్పుడు.. ఫ్రీగా అప్‌డేట్‌ అయ్యే చాన్సిచ్చింది మైక్రోసాఫ్ట్‌‌. అప్పుడు వద్దనుకునేవారు ఇప్పుడు అప్‌ గ్రేడ్‌ చేసుకోవాలంటే సుమారు రూ.9 వేలు (130 డాలర్లు) పెట్టాల్సిందే. అంటే అప్పుడు ఫ్రీగా సాఫ్ట్‌‌వేర్‌ను ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌‌ సంస్థ.. ఇప్పుడు డబ్బులకు దానిని అమ్ముతోందన్నమాట.