వనపర్తి, వెలుగు: నిరుద్యోగ యువత పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని డిగ్రీ కాలేజీలో ‘బీసీ స్టడీ సర్కిల్’ ను జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బిల్ గేట్స్ పదోతరగతి ఫెయిల్అయినా.. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ మేధావి అయ్యారని, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద నిరుద్యోగా యువత కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి అన్ని సౌలత్లు కల్పిస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి అభ్యర్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు చెప్పిన వారికి బహుమతులు ఇచ్చారు. మున్సిపల్‌చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, బీసీ వెల్ఫేర్ఆఫీసర్అనిల్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
అమనగల్లు, వెలుగు: మహానీయులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల చైర్మన్లు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో అంబేద్కర్, పూలే జ్ఞాన జాతర ప్రచార రథాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అక్టోబర్14 నుంచి నిర్వహించనున్న ఈ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్శ్యాంసుందర్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు పాపిశెట్టి రాము, జాతర కోఆర్డినేటర్ సుధాకర్, అధ్యక్షులు బిక్షపతి, జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్కొమ్ము తిరుపతి పాల్గొన్నారు.
ప్లాన్ ప్రకారం చదవాలి
నారాయణపేట, వెలుగు: విద్యార్థులు పక్కా ప్లాన్ ప్రకారం చదవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజీలో బీసీ స్టడీ సర్కిల్‌ను ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో జోనల్ విధానం కారణంగా ఏ జిల్లా అభ్యర్థులకు ఆ
జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడితేనే ఫలితం ఉంటుందని, ప్రభుత్వం జిల్లాకు వివిధ శాఖల్లో 748 పోస్టులను కేటాయించిందని చెప్పారు. పేద విద్యార్థులు పట్టణాలకు వెళ్లి కోచింగ్, మెటీరియల్స్కొనుక్కునే పరిస్థితి లేకపోవడాన్ని గుర్తించి.. స్డడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్డడీ సర్కిల్ కు వచ్చే విద్యార్థులకు తన సొంత నిధులతో క్యాంప్ కార్యాలయంలో భోజనం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణమా చారి, ప్రిన్సిపాల్ రంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, స్టడీ సర్కిల్ ఇన్‌చార్జి నారాయణ గౌడ్ పాల్గొన్నారు.
ధరణి సమస్యలు పరిష్కరించాలి
అయిజ, వెలుగు: ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వారంలోగా పరిష్కరించాలని కాంగ్రెస్ స్టేట్ ఓబీసీ సెక్రటరీ శెక్షావలి ఆచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ధరణి పోర్టల్‌లో జరిగిన తప్పులకు రైతులు బలవుతున్నారని వాపోయారు. వాటిని సరిచేయాలంటే మీసేవ సెంటర్లలో రూ. 2500 వరకు వసూలు చేస్తున్నారని, అయినా నెలల తరబడి అప్లికేషన్లు పెండింగ్‌లోనే ఉంటున్నాయన్నారు. ఆఫీసర్లు చేసిన తప్పులకు రైతులు ఎందుకు డబ్బులు కట్టాలని ప్రశ్నించారు. ఈ నెల 22లోగా ధరణి సమస్యలు పరిష్కరించక పోతే 23న రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మద్దిలేటి, మధు, జయన్న, బసవరాజు, సాంబశివుడు, రవీందర్, ఫిరోజ్, నరేశ్ పాల్గొన్నారు.
సమైక్యత చాటిన్రు
తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లు, కలెక్టర్ల ఆధ్వర్యంలో వేల మంది స్టూడెంట్లు జాతీయ జెండాలు చేతబట్టి భారీ ర్యాలీలు నిర్వహించారు. జై తెలంగాణ.. జై భారత్ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో చీఫ్ గెస్టులుమాట్లాడారు. నిజాం ఆధీనంలోని తెలంగాణ దేశంలో విలీనం అయిన తీరు, ఇందుకోసం భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ గురించి వివరించారు.
– నెట్‌వర్క్, వెలుగు
నిజాం కాలంలో ఎంతో అభివృద్ధి
నిజాం పాలనలో జరిగిన మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం జరిగింది. అప్పట్లోనే స్వతంత్ర్య న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసిన ఏకైక రాజు నిజాం. హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వేలు, సిమెంట్, షుగర్ పేపర్ మిల్లులను ఏర్పాటు చేసిండు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా.. కొన్ని అరాచకాలు చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయి. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ కారులను రజాకర్ల కన్నా పటేల్ సైన్యమే ఎక్కువగా కాల్చి చంపింది. 1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విలీనమైంది. ఇందుకోసం అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలోని భారత సైన్యం ఎంతో మంది ప్రాణాలు తీసింది.
–వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
దళితులను డైవర్ట్ చేసేందుకే అంబేద్కర్ పేరు
మిడ్జిల్, వెలుగు: సీఎం కేసీఆర్ దళితబంధు, మూడెకరాల భూమి, దళిత సీఎం హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. శుక్రవారం మిడ్జిల్ మండల కేంద్రంలో పేదలకు ఇండ్లు, జాగా ఉన్నోళ్లకు రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ సెక్రటరీ అనిరుధ్ రెడ్డి చేపట్టిన నిరసన దీక్షకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో వందల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, సీఎం కేసీఆర్ ఏనిమిదేండ్లైనా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో సొంత జాగా ఉండే రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఈ నిధులను రూ.3 లక్షలకు తగ్గించి అసెంబ్లీలో ప్రకటన చేసినా.. ఇప్పటి వరకు ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్ర రాలేదని, మన బిడ్డల భవిష్యత్ కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వచ్చిన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం, టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరును దత్తత తీసుకుంటున్నానని చెప్పిన కేసీఆర్ ... లక్షల కోట్లతో కాళేశ్వరం కట్టాడే తప్ప మూడునాలుగు వేలు ఖర్చు పెడితే పూర్తయ్యే భీమా, నెట్టెంపాడు, కేఎల్‌ఐని మాత్రం పట్టించుకోలేదన్నారు. అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి ప్రమాదంలో చనిపోయిన 12 కుటుంబాలకు ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మూడేండ్లు దాటి పోయిందని వాపోయారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పందించకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం మధుయాష్కీ గౌడ్ అనిరుధ్ రెడ్డికి నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాంతమ్మ బాలస్వామి, ఎంపీటీసీ గౌస్, మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రబ్బానీ, సంపత్ కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీలు పాల్గొన్నారు.
స్టూడెంట్ల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలి
ఆమనగల్లు, వెలుగు: కల్వకుర్తి నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన స్కూల్బిల్డింగ్స్, స్టూడెంట్ల సమస్యలపై ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్పందించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోని గవర్నమెంట్హైస్కూల్ను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందని, రెండేళ్ల కింద శ్లాబ్పైపెచ్చులు ఊడి స్టూడెంట్లు గాయపడ్డారని గుర్తుచేశారు. మధ్యాహ్న భోజనంపై గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. ఒక్కో స్టూడెంట్‌కు కేవలం రూ. 7 ఇస్తుండడంతో ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. వంట ఏజెన్సీలకు కూడా బిల్లులు ఇన్‌టైంలో ఇవ్వకపోవడంతో వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్ విజయకృష్ణ, నాయకులు గోరటి నరసింహ, శ్రీశైలం యాదవ్ తదితరులు ఉన్నారు.
కరెంటు షాక్‌తో ఒకరి మృతి
అమనగల్లు, వెలుగు: వెంచర్‌లో జెండాలు పాతుతుండగా కరెంట్ వైర్లు తగిలి ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఎక్కువపల్లికి చెందిన శివుడు(36) పదేళ్ల క్రితం అత్తవారి ఊరైన తలకొండపల్లికి వచ్చి మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తలకొండపల్లి మండలం కేంద్రం సమీపంలోని ఎక్స్ రోడ్డు వద్ద కొత్తగా వేసిన వెంచర్‌లో జెండాలు పాతేందుకు మామ పెద్దయ్యతో కలిసి వెళ్లాడు. జెండాలు పాతుతుండడంగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. శివుడు అక్కడికక్కడే చనిపోగా.. పెద్దయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మృతునికి భార్య సునీత, ఒక కూతురు ఉంది.
వసతి గదులు, క్యాంటీన్‌కు వేలంపాట
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు సంబంధించిన హేమలాపురి సదన్ వసతి గదుల అద్దె నిర్వహణ, ఆలయ పరిసరాల్లోని టిఫిన్ క్యాంటీన్ అద్దె వేలం పాటను శుక్రవారం నిర్వహించారు. ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరి, ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేలంపాటలో వసతి గృహం అద్దెను రమేశ్ అనే వ్యక్తి రూ. 87,500కు దక్కించుకున్నాడు. టిఫిన్ క్యాంటీన్ అద్దెను మోహన్ అనే వ్యక్తి రూ. 43 వేలకు దక్కించుకున్నాడు. చీరలు పోగు చేయటం, విక్రయించే వేలంపాటకు సరిగ్గా స్పందన రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
వనపర్త్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో ఆగస్టు 31న అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంపై పలువురు నేతలు శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంబేద్కర్ విగ్రహం తొలగించడాన్ని మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్‌కు నోటీసులు పంపిస్తామని, ఏ చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారో వివరణ కోరతామని జడ్జి చెప్పారన్నారు. ఈ కార్యక్రమం లో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నాగనమోని చెన్న రాములు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు, దళిత అభివృద్ధి సంఘం నాయకులు ధ్యారాపోగు రవిప్రసాద్, చిరంజీవి పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
ధన్వాడ, వెలుగు: ఎన్నికల హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ స్టేట్ ట్రెజరర్ బండారి శాంత కుమార్ పిలపునిచ్చారు. శుక్రవారం ‘ప్రజల గోస బీజేపీ భరోసా యాత్రలో’లో భాగంగా మండలంలోని రాంకిష్టాయ పల్లి , కిష్టాపూర్, గోటూర్, కొండ్రోన్‌పల్లి, కొండాపూర్, హన్మాన్‌పల్లి, చర్లపల్లి గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా.. రైతులకు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి తదితర హామీలు నెరవేర్చలేదన్నారు. కరెంట్, బస్‌చార్జీలు, లిక్కర్ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, నియోజకవర్గ ఇన్‌చార్జి రతంగ్‌పాండు రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మల్లయ్య, కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకుడు గోవర్ధన్‌గౌడ్, పార్టీ లీడర్లు పాల్గొన్నారు.
ప్రకాశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
అయిజ, వెలుగు: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి రజకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రజక సంఘం నాయకుడు మధు కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సంఘం ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటాన్ని చిట్టెలుకతో పోల్చడం దుర్మార్గమన్నారు. ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే రజక సంఘాల ఆధ్వరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.