ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

పెనుబల్లి, వెలుగు: గండి పడిన నాగార్జునసాగర్​ కాల్వకు త్వరగా రిపేర్లు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇరిగేషన్​ అధికారులకు సూచించారు. మండలంలోని తుమ్మలపల్లి గ్రామం వద్ద సోమవారం రాత్రి అండర్​టన్నల్​కు గండి పడగా, బుధవారం ఇరిగేషన్​ అధికారులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. సాగర్​ కాల్వ కింద వరి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారని, రైతులకు సాగు నీటి సమస్య రాకుండా వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని అన్నారు. అనంతరం వియ్యంబంజర్​ ఆర్కే ఫంక్షన్​హాల్​లో జరిగిన టీఆర్ఎస్​ మండల పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఐబీ ఈఈ శ్రీనివాసరెడ్డి, నరసింహారావు, డీఈలు రామారావు, అబ్దుల్​రహీమ్, జేఈ కిరణ్, మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, లక్కినేని వినీల్  పాల్గొన్నారు. 

అర్బన్​ పార్క్​ పనులు పూర్తి చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: గోళ్లపాడు ఛానల్  అర్బన్​ పార్క్​ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. బుధవారం పార్కులో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపింగ్ వెల్ రోడ్, రంగనాయకుల గుట్ట, సుందరయ్య నగర్ పార్కు ముందు, వెనుక భాగాల్లో, దాల్ మిల్ వద్ద 5 అర్బన్​ పార్కులను డెవలప్​ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, ఎల్లంపల్లి వెంకట్రావు, పబ్లిక్ హెల్త్  ఈఈ రంజిత్, ఏఈ హుస్సేన్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ ఉన్నారు.

గ్రానైట్​ కార్మికుడి అనుమానాస్పద మృతి

హత్యేనంటూ ఫ్యాక్టరీ ఎదుట యూపీ కార్మికుల అందోళన

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: యూపీకి చెందిన గ్రానైట్​ కార్మికుడు మోహిత్​ కుమార్​ మౌర్య(24) ఇండస్ట్రియల్​ ఏరియాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌర్య గత కొన్నేళ్ళుగా ఓ గ్రానైట్​ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. తాను పని చేస్తున్న గ్రానైట్​ ఫ్యాక్టరీ యజమాని గదిలో బుధవారం ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న యూపీ కార్మికులు పెద్ద ఎత్తున  ఫ్యాక్టరీకి చేరుకొని మౌర్యది హత్యేనని ఆరోపిస్తూ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు. ఏసీపీ అంజనేయులు అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడి డెడ్​బాడీనీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి​ కుటుంబసభ్యులు వచ్చాకే పోస్టుమార్టం నిర్వహిస్తామని అర్బన్​​సీఐ రామకృష్ణ తెలిపారు. పది రోజుల క్రితం ఫ్యాక్టరీ సూపర్​వైజర్​తో ఘర్షణ జరిగిందని, ఫ్యాక్టరీ యజమాని మౌర్యపై చేయి చేసుకున్నట్లు తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.

ట్రాక్టర్  బోల్తా పడి..

అశ్వారావుపేట, వెలుగు: దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్  బోల్తా పడడంతో మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన మక్కిళ్ల నాగరాజు(22) చనిపోయాడు. బుధవారం సాయంత్రం పొలంలో దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్  బోల్తా పడింది. నాగరాజు ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కిశోర్ రెడ్డి తెలిపారు.

పక్కాగా ఏర్పాట్లు చేయాలి

భద్రాచలం, వెలుగు: నవంబర్​ నెలలో జరిగే ఆరో ఇంటర్​ సొసైటీ లీగ్​ టోర్నమెంట్​ను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు ఆదేశించారు. తన చాంబరులో బుధవారం టోర్నమెంట్ ఏర్పాట్లపై సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు వస్తారని తెలిపారు. 5 వేల మంది క్రీడాకారులు, 500 మంది స్టాఫ్​కు వసతి కల్పించాలని సూచించారు. క్రీడలు ప్రారంభమయ్యే నాటికి మైదానాలన్నీ సిద్ధం చేయాలని కోరారు. తాగునీటి వసతి, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలతో త్వరలో మీటింగ్​ పెడతామని చెప్పారు. ఏపీవో జనరల్​ డేవిడ్​రాజు, డీడీ రమాదేవి, ఈఈ తానాజీ, ఏసీఎంవో రమణయ్య, క్రీడల అధికారి​ డా.వీరునాయక్  పాల్గొన్నారు.

ఐటీడీఏలో టెండర్లు

ఇంటర్​ సొసైటీ లీగ్​ టోర్నమెంట్​లో పాల్గొనే క్రీడాకారులు, గెస్ట్​లకు క్రీడాసామాగ్రితో పాటు వసతి ఏర్పాట్ల కోసం బుధవారం టెండర్లు నిర్వహించారు. వస్తువుల నాణ్యతను డీడీ రమాదేవి పరిశీలించారు. వాలీబాల్, టెన్నికాయిట్, హాకీ, చెస్, ఫుట్​బాల్, హ్యాండ్​బాల్, బాస్కెట్​బాల్, బాల్​బాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీ, అర్చరీ, ఖోఖో క్రీడా సామగ్రి, రగ్గులు, దుప్పట్లు, పరుపులను టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఏసీఎంవో రమణయ్య, క్రీడల అధికారి డా.వీరునాయక్  పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

మధిర/ ముదిగొండ, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు తెలిపారు. బుధవారం మధిర పెద్ద చెరువులో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్​ మాట్లాడుతూ సబ్సిడీపై చేపపిల్లలు, పరికరాలు, ఆటోలు అందిస్తుందని తెలిపారు. రూ.5.70 కోట్లతో ట్యాంక్​బండ్​ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్​ చైర్​పర్సన్​ ఎం లత,  కమిషనర్​ రమాదేవి పాల్గొన్నారు. అనంతరం చింతకాని మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.  బోనకల్​లో  బీసీ గురుకుల కాలేజీని ఎమ్మెల్యే పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముదిగొండ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ హరిప్రసాద్ తో కలిసి 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్  చెక్కులను పంపిణీ చేశారు. 

గ్రీన్​ ఫీల్డ్​ హైవే అలైన్​మెంట్​ మార్చాలి

ఆర్డీవో ఆఫీస్ ముట్టడించిన బాధిత రైతులు

ఖమ్మం టౌన్, వెలుగు: నాగపూర్–అమరావతి గ్రీన్ ఫీల్డ్  హైవే అలైన్​మెంట్​ను మార్చాలని ఆల్​ పార్టీ ఆధ్వర్యంలో  నిర్వాసితులు బుధవారం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. బాధితులు ఆఫీస్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు భాగం హేమంతరావు, సీపీఐ ఎంఎల్​ప్రజాపంథా నాయకుడు గోకునపల్లి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవేను రద్దు చేసి కొరివి నుంచి కోదాడ వరకు వెళ్లే హైవేకు లింక్​ చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలకు సంబంధం లేకుండా గ్రీన్ ఫీల్డ్  నిర్మిస్తామని చెప్పి గ్రామాలు, ఖమ్మం నగరాన్ని చీల్చేలా అలైన్​మెంట్​ చేశారని అన్నారు. బలవంతపు భూసేకరణ చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఎస్  నవీన్ రెడ్డి, పోటు ప్రసాద్, యర్రా శ్రీకాంత్, కొండపర్తి గోవిందరావు, బొంతు రాంబాబు, ఆవుల వెంకటేశ్వర్లు, భుక్యా వీరభద్రం, ఆవుల అశోక్, యర్రా శ్రీనివాస్, తక్కళపాటి భద్రయ్య పాల్గొన్నారు.