స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వండి

  • పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయండి: మహేశ్ గౌడ్

  • వరంగల్, కరీంనగర్, నిజామాబాద్​ నేతలకు పీసీసీ చీఫ్ దిశానిర్దేశం

  • జిల్లాల్లో పాత, కొత్త నేతల సమన్వయం బాధ్యత ఇన్​చార్జ్ మంత్రులదే

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ లీడర్లు, క్యాడర్ సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చని, ఆ దిశగా పార్టీని విస్తృతపరిచే కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని సూచించారు. 

శనివారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ అధ్యక్షతన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్​చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఆంధ్రలో వైసీపీని ఓడించి టీడీపీ అంతటి భారీ విజయాన్ని నమోదు చేయడం వెనుక ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండడమే కారణమన్నారు. తెలంగాణలో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధిస్తే.. ఆ తర్వాత జరిగే ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. 

రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం కీలకమన్నారు. అందుకే నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి పార్టీ టికెట్లు ఇస్తుందని, గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటుందన్నారు. 

నియోజకవర్గం స్థాయిలో మెజార్టీ లోకల్ బాడీలలో కాంగ్రెస్ గెలిచే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాంటి ఎమ్మెల్యేలకే రానున్న రోజుల్లో పార్టీ పరంగా భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలో మనం పదేండ్లు అధికారంలో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఉమ్మడి జిల్లాల్లో పార్టీలో పాత, కొత్త వారిని సమన్వయం చేసే బాధ్యత ఇన్​చార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరినందున ఇటు పాత వారిని, అటు కొత్తగా వచ్చిన వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఇన్​చార్జ్ మంత్రులు తీసుకోవాలని సూచించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ కేటాయింపులో కూడా సమన్యాయం పాటించాలని కోరారు. 

కొన్ని జిల్లాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య గ్యాప్ పెరిగిందని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అది లేకుండా చూసుకోవాలన్నారు. వ్యక్తిగత పలుకుబడి కాకుండా పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు రాలేదనే దానిపై విశ్లేషణ చేయాలన్నారు.

గాంధీ భవన్​లో కొండా లక్ష్మణ్​కు నివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్​లో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, దీపాదాస్ మున్షీ, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ అంజలి ఘటించారు.

మహేశ్ గౌడ్ ను అభినందించిన ఆర్.కృష్ణయ్య

పీసీసీ చీఫ్ గా నియమితులైన బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్ ను రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య శనివారం గాంధీ భవన్ కు వచ్చి అభినందించారు. మహేశ్ కు శాలువ కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీసీ నేతకు పీసీసీ పదవి ఇచ్చినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. కుల గణన చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి పదవుల్లో బీసీలకు న్యాయం చేయాలన్నారు.