చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి స్పందించారు. డీఎంకే నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం చెన్నైలో జరిగిన జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘డీఎంకే హయాంలో అన్ని స్థాయిల్లో అవినీతి జరిగింది. ప్రభుత్వోద్యోగులు, రవాణా రంగ కార్మికులతో పాటు పలు వర్గాల నుంచి ప్రభుత్వం నిరసనను ఎదుర్కొంటోంది. సీఎం స్టాలిన్‌ది అసమర్థ ప్రభుత్వం.
కడలూరు, విల్లుపురం తదితర ప్రాంతాల్లో వర్షాలు, వరదల పరిస్థితిపై వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్‌లు జారీ చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా స్టాలిన్ కుంభకర్ణుడిలా నిద్ర పోయారు. తమ పార్టీ 200 సీట్లు గెలుచుకుంటుందని డీఎంకే అగ్రనేత కనిమొళి అహంకారంతో చెబుతున్నారు. అది ఎప్పటికీ నిజం కాదు. కేవలం పగటికలగానే మిగిలిపోతుంది. అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమి మాత్రమే 200 సీట్లు గెలుచుకుంటుంది” అని పళనిస్వామి తెలిపారు.