నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు : గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్‌‌ మంచి ఫలితాలు సాధిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌ మండలం గూడూరులో బుధవారం ఆమె లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గురుకులాలు, జూనియర్‌‌ కాలేజీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్‌‌కు దీటుగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మూడు దశల్లో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. స్కూళ్ల అభివృద్ధి పనులకు సహకరించేందుకు ఎన్‌‌ఆర్‌‌ఐలు ముందుకు వస్తున్నారన్నారు. అనంతరం లైబ్రరీ ఏర్పాటుతో పాటు నిర్వహణ ఖర్చు భరిస్తున్న దాత మహేందర్‌‌రెడ్డిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్‌‌ ఎలిమినేటి సందీప్‌‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌‌ శ్రీధర్, యాదాద్రి కలెక్టర పమేలా సత్పతి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ దీపక్ తివారి, డీసీపీ కె.నారాయణరెడ్డి, డీఈవో నారాయణరెడ్డి పాల్గొన్నారు.

‘సాయి బృందావనం అద్భుతంగా ఉంది’

భూదాన్‌‌పోచంపల్లి, వెలుగు : యాదాద్రి జిల్లా భూదాన్‌‌పోచంపల్లి మండలం దేశ్‌‌ముఖి గ్రామంలో సాయి బృందావనం అద్భుతంగా ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. కొత్తగా కట్టిన అష్టభుజి ఆలయంలో బుధవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠకు ఆమె హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సాయిబృందావనాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఆమె వెంట జడ్పీ చైర్మన్‌‌ ఎలిమినేటి సందీప్‌‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌రెడ్డి, ఆలయ చైర్మన్‌‌ ఘంటా నారాయణస్వామీజీ, పండితులు వెలువలపల్లి చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యశాస్త్రి పాల్గొన్నారు.

నారసింహుడి సేవలో సీఎస్ సోమేశ్‌కుమార్‌

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని బుధవారం రాత్రి చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ ఫ్యామిలీతో దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం కోటికుంకుమార్చనలో పాల్గొన్నారు. అద్దాల మండపం వద్ద ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి స్వామివారి ప్రసాదం అందజేశారు. తర్వాత ఏపీ మంత్రి రోజా ఆలయానికి అందజేసిన ‘శ్రీమాలిక’ గ్రంధాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

చేపల టెండర్ వాయిదా

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాకు చేప పిల్లల సరఫరా టెండర్లు మరోసారి వాయిదా పడ్డాయి. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్‌‌లో పోసేందుకు 3.60 కోట్ల చేప పిల్లలను సరఫరా చేసేందుకు మేలో టెండర్లు పిలువగా మొత్తం 9 మంది బిడ్స్‌‌ వేశారు. గతంలో మూడు సార్లు టెండర్లు వాయిదా పడ్డాయి. తాజాగా బుధవారం ఫైనల్‌‌ చేయాల్సి ఉండగా మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అందుబాటులో లేకపోవడం వల్లే కొందరు లీడర్లు కలిసి టెండర్లను వాయిదా వేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ హాస్పిటళ్లలో నార్మల్‌‌ డెలివరీలు పెంచాలి

కోదాడ, వెలుగు : ప్రభుత్వ హాస్పిటళ్లలో నార్మల్‌‌ డెలివరీలు పెరిగేలా డాక్టర్లు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ కమిషనర్‌‌ శ్వేతా మహంతి సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌‌ను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌‌ రికార్డులు, వార్డులు, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ల వల్ల కలిగే నష్టాలపై మహిళలకు అవగాహ కల్పించాలని సూచించారు. గర్భిణులు ప్రతిరోజు ఎక్సర్‌‌సైజ్‌‌ చేయడం వల్ల నార్మల్‌‌ డెలివరీ అయ్యే చాన్స్‌‌ ఉంటుందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ఫ్రీగా నిర్వహించే ట్రూనాట్‌‌ క్షయ వ్యాధి పరీక్షలను అవసరమైన వారు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూర్యాపేట అడిషనల్‌‌ కలెక్టర్‌‌ హేమంత్‌‌ పాటిల్‌‌, డీఎంహెచ్‌‌వో హర్షవర్ధన్‌‌, డిప్యూటీ డీఎంహెచ్‌‌వో నిరంజన్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి వెంకటేశ్వర్లు, కోదాడ సూపరింటెండెంట్‌‌ రజని, రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్లు పద్మజ, రాజేశం, శ్రావణ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు జయ శ్యాంసుందర్, కళ్యాణ్ చక్రవర్తి, వెంకటరమణ, చంద్రశేఖర్‌‌, డాక్టర్లు ఝాన్సీ, సురేశ్‌‌, విజయ్‌‌, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

‘అమ్మనబోలు’ పోరాటం ఆగదు

నార్కట్‌‌పల్లి, వెలుగు : ఎవరు బెదిరించినా అమ్మనబోలు మండల సాధన పోరాటం ఆగదని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌‌పల్లి మండలం అమ్మనబోలులో బుధవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నార్కట్‌‌పల్లి, శాలిగౌరారం, రామన్నపేట తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం వరలక్ష్మి రాంరెడ్డి, ఎంపీటీసీ కొంపల్లి సైదులు, ఉప సర్పంచ్‌‌ ఎడమ జానారెడ్డి, పజ్జూరి నర్సిరెడ్డి, శివప్రసాద్ పాల్గొన్నారు.

అంగన్‌‌వాడీ టీచర్‌‌పై కేసు నమోదు

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడలోని బంగారుగడ్డ అంగన్‌‌వాడీ టీచర్‌‌ మల్లేశ్వరిపై  టూటౌన్‌‌ పోలీసులు చీటింగ్‌‌ కేసు నమోదు చేశారు. సీఐ సురేశ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం అర్ధరాత్రి బంగారుగడ్డ అంగన్‌‌వాడీ సెంటర్‌‌ నుంచి పౌష్టికాహారాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్థానిక కౌన్సిలర్‌‌, నాయకులు పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అంగన్‌‌వాడీ టీచర్‌‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

వేటు పడుతుందనే రాజగోపాల్‌రెడ్డి  రాజీనామా

సూర్యాపేట, వెలుగు : తనపై వేటు పడుతుందన్న భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి రాజీనామా చేశారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని పార్టీ ఆఫీస్‌‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌‌రెడ్డికి కాంగ్రెస్‌‌ పార్టీతోనే గుర్తింపు వచ్చిందన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌‌ అభిమానులు, కార్యకర్తల వల్లే 25 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది కానీ రాజగోపాల్‌‌రెడ్డి సొంత ఇమేజ్‌‌తో కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టులు ఎలా వచ్చాయో రాజగోపాల్‌‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. కాంగ్రెస్‌‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్‌‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలో కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌‌ ఫ్లోర్‌‌ లీడర్‌‌ కక్కిరేణి శ్రీనివాస్‌‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌‌ పార్టీని కానీ, నాయకులను కానీ విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో కొండపల్లి సాగర్‌‌రెడ్డి, కుంట్ల వెంకట నాగిరెడ్డి, నాగుల వాసు, ఆలేటి మాణిక్యం, గార్లపాటి వెంకట్‌‌రెడ్డి పాల్గొన్నారు.

బైపోల్‌‌లో కాంగ్రెస్‌‌ గెలుపు ఖాయం

మునుగోడు, వెలుగు : మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌‌కు కంచుకోటేనని, పార్టీ బలంగా ఉండడం వల్ల అక్కడ రాజగోపాల్‌‌రెడ్డి గెలిచారని డీసీసీబీ అధ్యక్షుడు శంకర్‌‌నాయక్‌‌ చెప్పారు. బైపోల్‌‌లో కాంగ్రెస్‌‌ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చండూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌‌రెడ్డి కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నాడు తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఆయన కాంగ్రెస్‌‌కు రాజీనామా చేసినా జరిగే నష్టమేమీ లేదన్నారు. ఈ నెల 5న చండూరులో 50 వేల మంది కార్యకర్తలతో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులను సస్పెండ్‌‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, నాయకులు పటేల్‌‌ రమేశ్‌‌రెడ్డి, కైలాష్‌‌ నేత, పల్లె రవికుమార్, పల్లె కళ్యాణి పాల్గొన్నారు. 

ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య పెంచాలి

గరిడేపల్లి, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య పెంచేలా స్కూల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీలు, సర్పంచ్‌‌లు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట డీఈవో అశోక్‌‌కుమార్‌‌ సూచించారు. గరిడేపల్లిలో నిర్వహిస్తున్న తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించడానికి ఉద్దేశించిన ట్రైనింగ్‌‌ క్లాస్‌‌లను సక్సెస్‌‌ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్‌‌ జనార్దన్‌‌, కోర్సు డైరెక్టర్‌‌ సత్యనారాయణరెడ్డి, దయాకర్, రవీందర్, పాపయ్య, సైదులు పాల్గొన్నారు.

తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి

గరిడేపల్లి, వెలుగు : చిన్నారులకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలని ఐసీడీఎస్‌‌ సూర్యాపేట జిల్లా ఆఫీసర్‌‌ జ్యోతి పద్మ సూచించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో బుధవారం జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె మాట్లాడారు. తల్లి పాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత, వైస్‌‌ ఎంపీపీ ప్రమీల, సర్పంచ్‌‌ సీతారాంరెడ్డి, ఎంపీటీసీ స్వప్న, ఎంపీడీవో వనజ, సీడీపీవో విజయలక్ష్మి, సూపర్‌‌వైజర్‌‌ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు

మునగాల, వెలుగు : రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు చేస్తున్నారని సీపీఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు బుర్రి శ్రీరాములు విమర్శించారు. మునగాలలోని పార్టీ ఆఫీస్‌‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. కలకోవ మత్స్యసొసైటీ ఎన్నిక జరగకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. అధికార పార్టీ లీడర్ల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. మత్స్య సొసైటీలో అక్రమాలు జరిగాయని చెబుతున్న నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌‌ చేశారు. మండల సెక్రటరీ చందా చంద్రయ్య, డి.స్టాలిన్‌‌రెడ్డి, నాయకులు మండవ వెంకటాద్రి, లింగయ్య పాల్గొన్నారు.

ఎలుకల బారి నుంచి కాపాడాలి

పెన్‌‌పహాడ్‌‌, వెలుగు : సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలం దోసపహాడ్‌‌లోని బీసీ గర్ల్స్‌‌ స్కూల్‌‌ను బుధవారం బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్‌‌లో వసతులు, ఫుడ్‌‌, స్టోర్‌‌రూమ్‌‌, క్లాస్‌‌ రూమ్స్‌‌ను పరిశీలించారు. అనంతరం ఎలుకలు కరిచిన స్టూడెంట్లతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎలుకల బారి నుంచి స్టూడెంట్లను కాపాడాలని డిమాండ్‌‌ చేశారు. మండల కన్వీనర్‌‌ వరకాల అంజయ్య, ఎంపీటీసీ జూలకంటి వెంకట్‌‌రెడ్డి,   గజ్జల ధర్మారెడ్డి పాల్గొన్నారు.

‘కేసీఆర్‌‌ను విమర్శించే స్థాయి సంజయ్‌‌కి లేదు’

యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌‌కి లేదని డీసీసీబీ చైర్మన్‌‌ గొంగిడి మహేందర్‌‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బుధవారం మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్టలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అట్టర్‌‌ ప్లాప్‌‌ అయిందన్నారు. బీజేపీ మీటింగ్‌‌కు ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక్కరు కూడా లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 15 సీట్లకే పరిమితం అవుతుందన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ జనాల్లో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూపాయి కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం, ఆలయ పనుల్లో అవినీతి జరిగిందని చెప్పడం సరికాదన్నారు. బండి సంజయ్‌‌కి ధైర్యం ఉంటే తనతో కలిసి వాసాలమర్రికి రావాలని సవాల్‌‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా కూడా గెలవలేరన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌ రియల్‌ ఎస్టేట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడని, యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు రెవెన్యూ పరిధిలో పేదలకు చెందిన 300 ఎకరాల భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. 

సీఎంఆర్‌‌ఎఫ్‌‌ చెక్కుల పంపిణీ

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని పలువురికి మంజూరైన సీఎంఆర్‌‌ఎఫ్‌‌ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అనంతరం నెమలిపురి పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన  ఎస్సీ బాయ్స్‌‌ గురుకుల జూనియర్ కాలేజీని ప్రారంభించారు. కార్యక్రమంలో కోదాడ ఎంపీపీ చింతా కవిత, జడ్పీటీసీ కృష్ణకుమారి, ఎంఈవో సలీం షరీఫ్, గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్‌‌ వెంకటేశం పాల్గొన్నారు.