ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెరిగేదెన్నడు?

ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెరిగేదెన్నడు?
  • 9 ఏండ్లైనా  పూర్తికాని ఘనపూర్ ఆనకట్ట పనులు
  • భూ పరిహారం అందక ఆగిన పనులు
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులివ్వకనే సమస్య
  • ఉన్నతాధికారులకు వద్దకు చేరిన ఫైల్

మెదక్​ జిల్లాలో ఏకైక మీడియం ఇరిగేషన్​ప్రాజెక్ట్ అయిన ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు గ్రహణం పట్టింది. శంకుస్థాపన జరిగి తొమ్మిదేండ్లు గడచినా పనులు అసంపూర్తిగానే ఉండి రైతుల్ని వెక్కిరిస్తున్నాయి. రైతులకు భూ పరిహారం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే ప్రాజెక్టుకు ఈ గతి పట్టింది. 

మెదక్​, కొల్చారం, వెలుగు: జిల్లాలోని కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేలి ఘనపూర్ మండలాల రైతాంగానికి ఆదరువైన ఘనపూర్​ ఆనకట్ట కింద 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. మంజీరా నది మీద110 ఏండ్ల కింద నిర్మించిన ఈ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోయి 0.135 టీఎంసీలకు తగ్గిపోయింది. దీంతో సెటిల్డ్​ ఆయకట్టు సాగుకు ఇబ్బంది కలుగుతుండటంతో ఆనకట్ట ఎత్తును 1.725 మీటర్లు పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.

2014 డిసెంబర్​లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ ఘనపూర్​ ఆనకట్ట వద్దకు వచ్చి ప్రత్యక్షంగా పరిస్థితి పరిశీలించారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని ఆనకట్ట ఎత్తు పెంపునకు నిధులు  మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు 2015లో ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు రూ.43.64 కోట్లు మంజూరు అయ్యాయి. అదే ఏడాది మే నెలలో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్​ రావు పనులకు శంకుస్థాపన చేశారు. టెండర్​దక్కించుకున్న కాంట్రాక్టర్​అగ్రిమెంట్ ​చేసుకుని పనులు మొదలు పెట్టారు. ఆనకట్ట దిగువన ఆప్రాన్​  నిర్మాణ పనులు పూర్తి చేశారు. కానీ, ప్రధాన ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ఇంకా మొదలు కానేలేదు. 

భూసేకరణ పెండింగ్​తో...

ఆనకట్ట ఎత్తు పెంపుతో పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సాన్​పల్లి, శేరిపల్లి, కొడపాక, కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘనపూర్, సంగాయిపేట​గ్రామాలకు చెందిన రైతుల 300 ఎకరాలకు పైగా  భూములు ముంపునకు గురికానున్నాయి. రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఎక్కడెక్కడ ఎంత మేర భూములు ముంపునకు గురవుతున్నాయో గుర్తించారు.  భూములు కోల్పోయే రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.13 కోట్లు అవసరం కాగా, రూ.5 కోట్లు మాత్రమే రావడంతో పాపన్నపేట మండల పరిధి గ్రామాల రైతులకు పరిహారం చెల్లించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు.

నిధులు లేక కొల్చారం  మండల పరిధిలోని చిన్నఘనపూర్, సంగాయిపేట గ్రామ రైతులకు పరిహారం చెల్లించలేదు. ఇరిగేషన్​ఆఫీసర్లు 2019లో ప్రపోజల్స్​ పంపించగా, నాలుగేండ్ల తర్వాత 2023లో ప్రభుత్వం రూ.8.10 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు పరిహారం అందలేదు.  ఫలితంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టలేని దుస్థితి నెలకొంది.  

పరిహారం పెంచాలి

ఘనపూర్​ ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.6 లక్షలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, రైతులు అవి సరిపోవంటున్నారు. భూముల విలువ బాగా పెరిగినందున అందుకు అనుగుణంగా న్యాయమైన పరిహారం ఇవ్వాలి. 

సునీతారెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే

60 శాతం పనులు పూర్తి

ఘనపూర్​ ఆనకట్ట ఎత్తును 1.7 మీటర్లు పెంచాలని నిర్ణయించడం జరిగింది. రూ.43.64 కోట్లు మంజూరయ్యాయి. ఆనకట్ట దిగువ పనులు దాదాపు 6‌ ‌శాతం పూర్తయ్యాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టలేదు. భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చూస్తాం. 

 శ్రీనివాస్ రావ్, ఇరిగేషన్​ ఈఈ, మెదక్ 

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలే

ఘనపూర్​ ఆనకట్ట ఎత్తు పెంపు నేపథ్యంలో భూములు కోల్పోయే  రైతులకు పరిహారం ఫైల్​ను ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేశాం. కానీ పైఅధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. 

మియా, కొల్చారం తహసీల్దార్​