కార్పొరేట్ స్కూల్​కు దీటుగా తీర్చిదిద్దాం : మహిపాల్​ రెడ్డి

కార్పొరేట్ స్కూల్​కు దీటుగా తీర్చిదిద్దాం : మహిపాల్​ రెడ్డి

పటాన్​చెరు, వెలుగు: కార్పొరేట్ స్కూల్స్​కు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో  ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దినట్లు పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్లాండ్ ఫార్మా  పరిశ్రమ సీఎస్​ఆర్​ హెడ్ రఘురామన్ తో కలిసి పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించిన గ్లాండ్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

నియోజకవర్గంలో ప్రభుత్వ  విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కావ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ సురేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

రాబోయే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి సమీక్షించారు. ప్రతి సంవత్సరం లాగే నిర్దేశించిన సమయంలోగా జెండాను ఆవిష్కరించి పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విజేతలకు సొంత నిధులచే బహుమతులు అందిస్తానని తెలిపారు. అనంతరం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.