సిరిసిల్ల టౌన్, వెలుగు: అడ్వకేట్ పేరిట రూ. కోట్లలో వసూలు చేసిన ఘరానా మోసగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కృష్ణ తెలిపిన ప్రకారం.. సిరిసిల్ల టౌన్ కు చెందిన ఏనుగు ఫణీందర్(33) అడ్వకేట్ అని చెప్పుకుంటున్నాడు. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ తో మంచి సంబంధాలు ఉన్నాయని.. వివిధ కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా చేస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
టౌన్ లోని ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ కాళీమాత భూ సమస్య పరిష్కరిస్తానని రూ.25 లక్షలు, పెద్దూరులో డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని విజయలక్ష్మి వద్ద రూ.1.90 లక్షలు తీసుకున్నాడు. ఇలా పలువురి వద్ద మొత్తం రూ. కోటి 30 లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. -నిందితుడి వద్ద మొబైల్ ఫోన్, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఫణీందర్ బారిన పడి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేయాలని సీఐ కృష్ణ సూచించారు.