ఘట్ కేసర్ కారు దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే కారులో శ్రీరామ్ (26) అనే యువకుడితో పాటు ఒక యువతి ఉన్నట్లుగా తెలుస్తోంది.
మృతికి గల కారణం ప్రేమ వ్యవహారం అని తెలుస్తోంది. మృతుడు శ్రీ రామ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో అతని తమ్ముడు పోలీసులకు తెలిపాడు. తన అన్న గత ఐదు ఏండ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. ఈ ప్రేమ విషయం తెలిసిన ఒక వ్యక్తి తన సోదరుణ్ని బెదిరించి ఇప్పటికే ఒక లక్ష 35 వేల రూపాయలు తీసుకున్నాడని, ఆ విషయం సోమవారం (06 జనవరి 2025) పెద్దన్న కుమారుడు నరసిహ్మకు ఫోన్ చేసి శ్రీ రామ్ చెప్పాడని తెలిపాడు.
శ్రీరామ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా, చనిపోతానని లెటర్ రాసినట్లుగా అతని సోదరుడు తెలిపాడు. అయితే కారులో శ్రీరామ్ తో పాటు ఉన్నది అతని ప్రేయసేనా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది. మృతుడు శ్రీరామ్ ప్రియురాలు నిఖిత మైనర్ అని పోలీసులకు వివరాలు అందించాడు.
నిఖిత స్వస్థలం పోచారం మున్సిపాలిటీలోని చౌధర్ గూడ అని తెలుస్తోంది. మృతురాలు నిఖిత ఆఖరిగా తన నాన్న మొబైల్ కి I miss you Dady అని ఎస్ఎంఎస్ చేసినట్లు తెలుస్తోంది.
శ్రీరామ్, నిఖిత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన కొందరు యువకులు బ్లాక్ మెయిల్ చేయడంతో ఇబ్బందులకు గురయ్యారని శ్రీరామ్ సోదరుడు తెలిపాడు. యువకుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది:
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘనపూర్ వద్ద ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డుపై సోమవారం (6 జనవరి 2025) సాయంత్రం ఎర్టిగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు.
మంటల్లో మృతిచెందిన వ్యక్తిని యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పిలాయిపల్లికి చెందిన శ్రీ రామ్(26) గా పోలీసులు గుర్తించారు. శ్రీ రామ్ ప్రస్తుతం యదాద్రి జిల్లా జమిళపేట్ లో ఉంటున్నాడు. వృత్తి రీత్యా ఘట్ కేసర్ నారపల్లిలో హోల్ సేల్ సైకిల్ షాప్ నిర్వహిస్తాడని స్థానికులు తెలిపారు. మంటల్లో మృతి చెందిన అమ్మాయి నిఖితగా చెబుతున్నప్పటికీ.. నిర్ధారణ కావాల్సి ఉంది.
ALSO READ | ఘట్ కేసర్ దగ్గర కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం
జనవరి 6 సోమవారం ఉదయం నారపల్లిలోని స్నేహితుడి వద్ద ఎర్టిగా కారు తీసుకొని బయటకు వచ్చాడని సమాచారం ఉంది. ఘట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మార్గం నుండి అబ్దుల్లాపూర్ మెట్ వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహన దారులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. మృతుడు శ్రీరామ్ సోదరుడు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆత్మహత్యగా తెలుస్తోంది.