- ఎండోమెంట్ అటెండర్‌పై ఘట్కేసర్ కమిషనర్ ఫైర్
- ఆలయ భూముల్లో నిర్మాణాలు ఎందుకు ఆపావంటూ వార్నింగ్
- సోషల్‌మీడియాలో వీడియో వైరల్
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ దేవదాయ శాఖకు చెందిన అటెండర్‌ను దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఘట్కేసర్లోని18వ వార్డులోని సర్వే నంబర్11, 12లోని ఎండోమెంట్ భూముల్లో నిర్మాణాలను ఎందుకు ఆపావ్అంటూ ఎండోమెంట్ లో అటెండర్ గా పనిచేస్తు న్న జీడీ పాండును శనివారం తన ఆఫీసుకు పిలిపించుకొని బెదిరించాడు. కమిషనర్‌తో పాటు మున్సిపల్ అవుట్ సోర్స్ సిబ్బంది అనిత, కృష్ణ కూడా పాండుపై విరుచుకుపడ్డారు. ‘నోటీసులివ్వడానికి నీకేం సంబంధం. నువ్వెవరు. ఏం తమాషాలు చేస్తున్నావా? నీ అంతు చూస్తా. అవును నేనే పర్మిషన్ ఇచ్చా. అయితే ఏంటి? బొక్కలో వేయిస్తా కొడకా’ అంటూ కమిషనర్పరుష పదజాలంతో పాండును తిట్టాడు. దీన్నంతా పాండు తన ఫోన్లో రహస్యంగా రికార్డు చేశాడు.
ఘటనపై పాండు మాట్లాడుతూ.. ఎండోమెంట్ ఈఓ భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు దేవాదాయ భూముల్లో నిర్మిస్తున్న కట్టడాలకు నోటీసు ఇచ్చి వచ్చానని, అందులో తన తప్పేమీ లేదన్నారు. ఈ విషయమై కమిషనర్ సాబేర్ అలీని సంప్రదించగా ‘పాండుపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో పిలిచి ఎంక్వైరీ చేశానని చెప్పారు. ఈఓ భాగ్యలక్ష్మి వివరణ కోరగా తానే అటెండర్పాండుకు నోటీసులు ఇచ్చి పంపించానని చెప్పారు. కమిషనర్తనను పిలిచాడని తాను బిజీగా ఉండడం వల్ల వెళ్లలేదన్నారు. దీంతో కమిషనర్.. అటెండర్‌కు ఫోన్‌చేసి పిలిపించుకున్నట్టు తెలిసిందన్నారు. మున్సిపల్కమిషనర్తమ అటెండర్‌ను పిలిచి ఎంక్వైరీ చేసే అధికారం లేదన్నారు.