హైదరాబాద్ : నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి.. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఫేక్ ఎస్ఐను కటకటాల్లోకి నెట్టారు ఘట్‌కేసర్ పోలీసులు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొంతకాలంగా నిరుద్యోగులను నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు కుసుమ ప్రశాంత్ అనే వ్యక్తి.
మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటసాయినగర్‌లో నివాసం ఉంటున్న ప్రశాంత్.. త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. ప్రశాంత్ చేతిలో మోసపోయిన కలకుంట్ల ప్రసాద్ (40) (వృత్తిరీత్యా డ్రైవర్) అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం యమ్నంపేట ఎక్స్ రోడ్ వద్ద నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుంచి ఒక యూనిఫాం, ఒక జత బూట్లు, ఒక జత ఖాకీ సాక్స్, రెండు మొబైల్ ఫోన్లు, రూ.21 వేల 300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలీసు యూనిఫాం ధరించి రిజర్వ్‌డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకుని.. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అమాయకులను మోసం చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.