తక్కువ ఆస్తి పన్ను కడుతున్నోళ్లకు జీహఎచ్ఎంసీ యాక్షన్

తక్కువ ఆస్తి పన్ను కడుతున్నోళ్లకు జీహఎచ్ఎంసీ యాక్షన్
  •  పాత ఆస్తులు రివిజన్ చేసి కొత్త ట్యాక్స్​అమలు
  •  19 లక్షల ప్రాపర్టీల తనిఖీ..10 వేల మందికి నోటీసులు  
  •  అనుమతి లేకుండా ఫ్లోర్లకు ఫ్లోర్లు లేపుతున్నట్లు గుర్తింపు 
  • జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీ గండి


హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆస్తి పన్ను తక్కువ కడుతున్న వారిపై బల్దియా యాక్షన్ తీసుకుంటోంది. ఆస్తి విలువ ఎక్కువగా ఉండి రికార్డుల్లో తక్కువ చూపుతూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న వారిని గుర్తిస్తోంది. గ్రేటర్​లోని 19 లక్షల ప్రాపర్టీలను పక్కాగా తనిఖీ చేస్తోంది. ఎక్కడైనా ప్రాపర్టీ విస్తీర్ణంలో తేడా ఉంటే వారికి సెక్షన్ 213 కింద నోటీసులు ఇస్తోంది. 

ఇప్పటికే 10 వేల మందికి నోటీసులు ఇచ్చి వారి ప్రాపర్టీని రీ అసెస్​మెంట్ చేసింది. బిల్డింగుల విస్తీర్ణాన్ని బట్టి వందశాతం ఆస్తి పన్ను కలెక్ట్ చేస్తోంది. చాలా మంది ఏండ్ల కింద నిర్మించుకున్న ఇండ్లకు తక్కువగా పన్ను కడుతున్నారు. మొదట్లో రూల్స్​ప్రకారం బిల్డింగ్​ నిర్మించి, తర్వాత ఫ్లోర్​పై ఫ్లోర్​వేస్తూ పెంచుకుంటూ పోయారు. కొందరైతే అనుమతి కూడా తీసుకోకుండానే అంతస్తుల మీద అంతస్తులు కట్టారు. 

ఇలాంటి సందర్భాల్లో అందుకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ చేసుకొని ట్యాక్స్ చెల్లించాలి. కానీ, చాలా మంది ఇలా చేయకుండా బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో ఇప్పటివరకు 19 లక్షల ప్రాపర్టీలను తనిఖీ చేసిన అధికారులు పది వేల మందికి నోటీసులు ఇచ్చి అదనపు ట్యాక్స్​వసూలు చేస్తున్నారు. ఈ ఏడాదికి ప్రాపర్టీ ట్యాక్స్​కలెక్షన్​టార్గెట్​ను రూ.2,400 కోట్లుగా పెట్టుకోగా ఏప్రిల్ నుంచి డిసెంబర్​10 వరకు  రూ.1,450 కోట్లు వసూలైంది. 

  • అప్పులతో విలవిల.. ఆస్తి పన్నే ఆధారం

జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలో మునిగిపోతోంది. కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడుతోంది. రూ.6500 కోట్లు అప్పులు అలాగే ఉన్నప్పటికీ.. ఆస్తి పన్ను ద్వారా వస్తున్న ఆదాయంతో బల్దియా నడుస్తోంది.  ఈ క్రమంలో ఆస్తిపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారినే టార్గెట్ ​చేసి కలెక్ట్ చేయాలని అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

ALSO READ : రూ.1,800 కోట్ల గ్రాంట్​ ఇవ్వండి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​కు సీఎం రేవంత్​ వినతి

సిబ్బందికి నెలవారి టార్గెట్లు పెట్టడం, ట్యాక్స్​పేయర్స్​కి రోజూ మెసేజ్​లు పంపడం, బకాయిలు ఉన్నవారి ఇంటికి రెగ్యులర్​గా వెళ్తూ వసూలు చేస్తుండడంతో ఆదాయం పెరుగుతోంది. తాజాగా ఆస్తి పన్ను విషయమై రెవెన్యూ అడిషనల్ కమిషనర్.. డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పక్కాగా కలెక్షన్ రాబట్టాలని, టార్గెట్ రీచ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు.

  • ఏడాది వారీగా ఎంత వసూలైందంటే..  

ఏడాది          టార్గెట్​       వసూలైంది(రూ.కోట్లలో) ( 8 నెలల 10 రోజులకు) 

2024–25        2,400         1,450       
2023–24        2,000         1,915  
2022–23        1,800         1,658 
2021–22        1,800         1,681  
2020–21        1,500         1,633 
2019–20        1,500         1,357