పోలింగ్​పై ఎండల ఎఫెక్ట్ పడకుండా జీహెచ్ఎంసీ యాక్షన్ ​ప్లాన్

పోలింగ్​పై ఎండల ఎఫెక్ట్ పడకుండా జీహెచ్ఎంసీ యాక్షన్ ​ప్లాన్

హైదరాబాద్, వెలుగు: రోజురోజుకు పెరిగిపోతున్న ఎండల ఎఫెక్ట్ లోక్​సభ ఎన్నికలపై పడకుండా జీహెచ్ఎంసీ ప్లాన్​చేస్తోంది. అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఫోకస్​పెట్టింది. ప్రస్తుతం గ్రేటర్​సిటీ వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ నెల 13న పోలింగ్​డే నాటికి ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోలింగ్​సెంటర్ల వద్ద కూలైన్లలో నిలబడే ఓటర్ల కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్​రోస్​ఆదేశించారు. 

డ్రింకింగ్ వాటర్, ఫ్యాన్లు, కూలర్లు, వాష్ రూమ్స్, వీల్ చైర్లు, హెల్త్ స్టాఫ్ ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. నాలుగేండ్ల కింద జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 46.68 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.88 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. రెండుసార్లు ఎన్నికలు చలికాలంలోనే జరిగినప్పటికీ పోలింగ్ శాతం 50 దాటలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లను చూసి చాలా మంది ఓటు వేయకుండా వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో సిటీ ఓటర్లు ఏ మేరకు పోలింగ్​కేంద్రాలకు వస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఓటింగ్​శాతం పెంచడంతోపాటు, ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ పూర్తి

హైదరాబాద్ జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలతోపాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు మొత్తం 1,675 లొకేషన్లలో 3,986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన చోట మూడు రోజుల ముందుగానే అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని రోనాల్డ్​రోస్​ఆదేశించారు. మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్​ప్రక్రియను పూర్తిచేసినట్లు వెల్లడించారు. అవసరాని కంటే 20 శాతం అదనంగా మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్లు అనుదీప్ దురిశెట్టి, హేమంత్ కేశవ్ పాటిల్, కంటోన్మెంట్ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ మధుకర్ నాయక్, మ్యాన్ పవర్ నోడల్ ఆఫీసర్​ఉపేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు.