- జీహెచ్ఎంసీ, జలమండలి సంయుక్తంగా నిర్ణయం
- క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న 2 శాఖల అధికారులు
- ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని పార్కులకు తరలింపు
- స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో ట్రీట్‌మెంట్ నీటికి ప్రాధాన్యం
హైదరాబాద్, వెలుగు: బల్దియా సరఫరా చేస్తున్న తాగునీటితో ఇళ్లు, వాహనాలు కడిగేవారిని గుర్తించి భారీ జరిమానాలు విధించాలని జీహెచ్ఎంసీ, జలమండలిలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఇలా కడగడంతో భారీగా నీరు వృథా అవుతోందని రెండు శాఖల అధికారులు గుర్తించారు. ఈ మేరకు శనివారం జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారుల సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు జలమండలి విద్యుత్ చార్జీల నిమిత్తం రూ.700 కోట్లు చెల్లిస్తుందని చెప్పారు. ఇందులో దాదాపు రూ.200కోట్ల విలువైన నీరు వృథాగా పోతుందని తెలిపారు. ప్రతిరోజు 50 మిలియన్ గ్యాలన్ల నీరు వృథా అవుతోందన్నారు. దీన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే రెండు శాఖల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కడుగుతున్నవారిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించి ఫైన్లు విధించాలని ఆదేశించారు. ఈ జరిమానాలకు సంబంధించి వివరాలను రూపొందించి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఆమోదింపజేయాలని కోరారు.
20 ప్లాంట్ల నుంచి..
గ్రేటర్ హైదరాబాద్‌లోని వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు 20 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయని, వీటి ద్వారా వచ్చే ట్రీటెడ్నీటిని పార్కులకు ఉపయోగించాలని కమిషనర్ దానకిశోర్ ఆదేశాలు జారీచేశారు. ఎస్‌టీపీల నుంచి సమీపంలోని పార్కులకు ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ -2020లో ట్రీట్మెంట్వాటర్ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. నగరంలో పూర్తిస్థాయిలో ఎస్‌టీపీల ద్వారా శుద్ధిచేసిన జలాలను ఉపయోగించుకోవాలని కోరారు.
త్వరలో స్వచ్ఛ భారత్ పార్క్ లు
స్వచ్ఛ కార్యక్రమాలపై మరింత చైతన్యం చేయడానికి స్వచ్ఛ భారత్ అంశాలను తెలియజేసే కాన్సెప్ట్‌తో ‘స్వచ్ఛ భారత్’ పార్కుల నిర్మాణాలు చేపట్టనున్నట్టు దానకిశోర్ ప్రకటించారు.ఈ వినూత్న కార్యక్రమాలను కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రత్యేకంగా గుర్తించి దేశ వ్యాప్తంగా అమలుపరుస్తుందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అంశాలు ప్రతిబింబించేలా పార్కులను రూపొందించనున్నట్టు తెలిపారు. నగరంలో 46 కొత్త పార్కులు మంజూరు చేశామని వీటిలో కొన్నింటిని స్వచ్ఛ భారత్ పార్కులుగా ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని జోన్లలో కనీసం ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఆరోగ్య కమిటీల ఏర్పాటు
స్వయం సహాయక బృందాల మహిళలతో ఆరోగ్య కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని దానకిశోర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, మాతా శిశు సంరక్షణ, బస్తీ దావఖానాలపై చైతన్యం తదితర అంశాలను స్థానికులకు తెలియజేసేందుకు ఈ కమిటీలు కీలక పాత్ర వహించాలని సూచించారు. సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమంపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సిక్తాపట్నాయక్, అద్వైత్ కుమార్ సింగ్, కెనడి, కృష్ణ, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, శంకరయ్య, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి, సిఇ లు సురేష్, శ్రీధర్, జియాఉద్దీన్, సీసీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.