బల్దియా స్టడీ టూర్ల బాట

బల్దియా స్టడీ టూర్ల బాట
  •     ఉత్తర్​ప్రదేశ్, మధ్య ప్రదేశ్​కు వెళ్లొచ్చిన మేయర్​, డిప్యూటీ మేయర్
  •     కొద్ది రోజుల కింద సియోల్​లో అధికారుల పర్యటన
  •     సాలిడ్​ వేస్ట్​మేనేజ్​మెంట్​పై జపాన్ ​వెళ్లిన బల్దియా బృందం
  •     ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్​చేస్తరో మాత్రం చెప్తలేరు 
  •     దీపావళి తరువాత బెంగళూరుకు హైడ్రా చీఫ్

హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ, హైడ్రాలు స్టడీ టూర్ల బాట పట్టాయి. రెండు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధులు దేశ, విదేశాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు, పలువురు అధికారులు ఇండోర్, లక్నో, గౌహతి, షిల్లాంగ్ సిటీల్లో శానిటేషన్, సాలిడ్ వేస్ట్​మేనేజ్​మెంట్, టెక్నికల్ అంశాలను స్టడీ చేసి వచ్చారు. మేయర్, కొందరు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మధ్యప్రదేశ్​లోని ఇండోర్, ఉత్తర్​ప్రదేశ్​లోని లక్నో సిటీలను చుట్టేసి వచ్చారు.

డిప్యూటీ మేయర్, ఇంకొంత మంది కార్పొరేటర్లు మేఘాలయలోని షిల్లాంగ్, అస్సాంలోని గౌహతి సిటీల్లో పర్యటించి అక్కడ క్లీనింగ్, వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, మురుగు జలాల నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి అంశాలపై స్టడీ చేసి వచ్చారు. కొద్ది రోజుల కింద మేయర్, డిప్యూటీ మేయర్, మంత్రులు, అధికారులతో కలిసి సౌత్ కొరియాలోని సియోల్ లో పర్యటించారు. నగరంలోని మూసీ పునరుజ్జీవం కోసం సియోల్ సిటీలో హాన్​నదిని పరిశీలించి అధ్యయనం చేశారు.

వీరితో పాటు పలువురు బల్దియా ఉన్నతాధికారులు సాలిడ్ వేస్ట్​మేనేజ్​మెంట్​పై జపాన్ వెళ్లారు. జీహెచ్ఎంసీలో కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి, ఇతర రాష్ట్రాలు, దేశాలు ఉపయోగిస్తున్న టెక్నాలజీలను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేందుకు ఈ పర్యటనలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.   

రెండ్రోజుల కింద వెళ్లాల్సి ఉన్నప్పటికీ

దీపావళి తర్వాత హైడ్రా కమిషనర్ కర్నాటక రాజధాని బెంగళూరు సిటీలో పర్యటించనున్నారు. రెండురోజుల క్రితమే వెళ్లాల్సి ఉన్నప్పటికీ, అక్కడ వర్షాల నేపథ్యంలో పోస్ట్ పోన్ చేసుకున్నారు. బెంగళూరులోని కొన్ని చెరువులను అక్కడి సర్కారు సీఎస్ఆర్ కింద అప్పగించి అద్భుతంగా డెవలప్​చేసింది. అయితే, అది ఎలా చేశారన్నది తెలుసుకోవడానికి హైడ్రా చీఫ్​రంగనాథ్​బెంగళూరు వెళ్తున్నారు. అవసరమైతే ఇతర పట్టణాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.  

అమలు ఎప్పటి నుంచో..

అధికారులు, ప్రజాప్రతినిధులు అధ్యయనాలకు వెళ్తూ ఆయా నగరాల్లో రోడ్లు క్లీన్ గా ఉన్నాయని, సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్ చాలా బాగుందని, ఇతర పౌరసేవల నిర్వహణ కూడా అద్భుతమని చెబుతున్నారే తప్ప.. ఇక్కడ ఎప్పటి నుంచి అమలు  చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.