
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 63 శాతం దాటని ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు
- పెనాల్టీపై 90 శాతం మాఫీ ప్రకటించినా ముందుకురాని ప్రజలు
- రూ.1645.04 కోట్లకు డిమాండ్ నోటీసులు.. రూ.1,035 కోట్లు మాత్రమే వసూళ్లు
- వసూళ్లలో వెనుకబడిన మున్సిపల్ కార్పొరేషన్లు
- 100 శాతం ట్యాక్స్ వసూళ్లతో జమ్మికుంట, హుజురాబాద్ రికార్డు
కరీంనగర్, వెలుగు: ఏదైనా వస్తువు ‘ఆఫర్’లో వస్తుంది అనగానే కొనడానికి ఎగబడే ప్రజలు... అదే ఆఫర్‌ను ఉపయోగించుకొని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెనాల్టీలో 90 శాతాన్ని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా ట్యాక్స్ కట్టేందుకు నగరవాసులు మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్యాక్స్ వసూళ్లు 63 శాతం కూడా దాటలేదు.
పెండింగ్‌లో రూ. 1645 కోట్లు.. వసూలైంది రూ. 1,035 కోట్లే..
వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ఆఫర్‌ను మొదట గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమితం చేసిన ప్రభుత్వం.. మార్చి 25 నుంచి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తింపజేసింది. ఈ ఆఫర్‌తో భవన యజమానుల నుంచి అనూహ్య స్పందన ఉంటుందని భావించినప్పటికీ.. అనుకున్నంతగా ట్యాక్స్ వసూలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 126 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో కలిపి 25,33,361 అసెస్మెంట్ల (రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్) నుంచి రూ.1645.04 కోట్లు వసూలు చేసేందుకు డిమాండ్ నోటీసులు ఇచ్చారు. కానీ సోమవారం సాయంత్రం వరకు రూ.1,035 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.
ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్‌మెంట్ ఆఫర్ మార్చి 31తో ముగిసింది. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ సందర్భంగా సెలవు అయినప్పటికీ మున్సిపల్ ఆఫీసర్లు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గతేడాది గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మినహా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.1,300.07 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా 2024 మార్చి 31 నాటికి రూ.922.03 కోట్లు (70.92 శాతం) వసూలైంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 7 శాతం ట్యాక్స్ తక్కువ వసూలు కావడం గమనార్హం.
జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలు రికార్డు
రాష్ట్రలోనే 100 శాతం వన్ను వసూలు చేసిన మున్సిపాలిటీలుగా జమ్మికుంట, హుజురాబాద్ రికార్డు సృష్టించాయి. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 8,917 ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్స్ నుంచి రూ.2.64 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 12,607 ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్స్ నుంచి రూ.3.03 కోట్లు పూర్తిగా వసూలు అయ్యాయి. మార్చి 20వ తేదీ వరకే 100 శాతం ట్యాక్స్ వసూలు చేశారు. గతేడాది 5.61 కోట్లకు గానూ 5.58 కోట్ల (99.52 శాతం)తో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన సిరిసిల్ల ఈ సారి 95 శాతం వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. 5.50 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లతో అసిఫాబాద్ మున్సిపాలిటీ లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
ఈ మున్సిపాలిటీలో 6,264 అసెస్‌మెంట్ల నుంచి రూ.2.28 కోట్ల ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా.. కేవలం రూ. 15 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిరుడు 34.77 శాతం పన్నులు వసూలైతే ఈ సారి 26 శాతం కూడా దాటలేదు. ఇక్కడ 26.01 కోట్లు పెండింగ్ ఉండగా.. 6.80 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 29.20 శాతం, నల్గొండ మున్సిపాలిటీలో 35 శాతం, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 37.20 శాతం, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో 38 శాతం పన్నులు వసూలు అయ్యాయి.
ట్యాక్స్ వసూళ్లలో వెనుకబడ్డ కార్పొరేషన్లు
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు ట్యాక్స్ వసూళ్లలో చాలా వెనుకబడ్డాయి. కార్పొరేషన్ల వారీగా చూస్తే రూ.23.74 కోట్లకుగానూ రూ.20.86 కోట్ల (87 శాతం) వసూళ్లతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.63.58 కోట్లకు రూ.52 కోట్లు (82 శాతం) వసూలు అయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్ గతేడాది 91.24 శాతం వసూళ్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలువగా.. ఈ సారి 72 శాతంతో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. టార్గెట్‌లో సగానికంటే తక్కువ పన్ను వసూళ్లతో నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం కార్పొరేషన్లు చివరి నుంచి మూడు స్థానాల్లో నిలిచాయి.