జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ వన్​టైం సెటిల్​మెంట్: ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం రాయితీ..

జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ వన్​టైం సెటిల్​మెంట్: ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం రాయితీ..
  • నేటి నుంచి ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ
  • ఈ నెలాఖరు వరకు గడువు  
  • ఈసారి టార్గెట్​ రూ.2 వేల కోట్లు 
  • ఇప్పటికే రూ.1,550 కోట్ల కలెక్షన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో వన్ టైమ్​సెటిల్ మెంట్ స్కీమ్(ఓటీఎస్) మరోసారి అందుబాటులోకి వచ్చింది. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ స్కీం అమలులో ఉండనున్నది. దీనికి సంబంధించి శుక్రవారం ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్​ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్ లో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కేవలం10 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించవచ్చు. 

మొత్తం బకాయిలు రూ.11,668 కోట్లు  

గ్రేటర్​లో 15 ఏండ్లుగా ఆస్తి పన్ను బకాయిలు రూ.11,668 కోట్లు పేరుకు పోయాయి. ఇందులో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తి పన్నే రూ.5,500 కోట్లు ఉన్నాయి. మిగతా రూ.5 వేల కోట్లు ప్రజల నుంచి రావాల్సి ఉంది. మొత్తం 19.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుండగా, వీరిలో 6 లక్షల మంది  మొండిబకాయాదారులున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.1550  కోట్ల ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఓటీఎస్​అమల్లోకి రావడంతో టార్గెట్ రీచ్ అవుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

నాలుగోసారి అమలు..

బల్దియాలో ఇప్పటివరకు మూడు సార్లు వన్​టైమ్​సెటిల్​మెంట్​స్కీమ్​అమలు చేశారు. మొదటిసారి 2020–21లో ఆగస్టు1 నుంచి నవంబర్ 15 వరకు ఓటీఎస్ ద్వారా రూ.400 కోట్లు వచ్చింది. 2022–23 లో మళ్లీ జులైలో అమలు చేయగా, రూ.170 కోట్లు,  2024–25  మార్చిలో రూ.350 కోట్ల వచ్చింది. ఇప్పుడు రూ.500 కోట్ల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.