డివిజన్ స్థాయి పాలనకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

డివిజన్ స్థాయి పాలనకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: జూన్ 2 నుంచి డివిజన్ స్థాయి పాలన ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు డివిజన్ స్థాయి పాలనే ఉత్తమంగా భావించి ఇందుకు తగినట్లు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో డివిజన్ ఆఫీసులో ఒక రిసెప్షనిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు మొత్తం 11 మంది ఉండనున్నారు. డివిజన్ స్థాయిలో ఇప్పటికే అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా అక్కడ చేయాల్సిన పనులపై శిక్షణ కూడా ఇచ్చారు. అయితే డివిజన్ స్థాయిలో బాధ్యతలు అప్పగించిన అధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారులు ప్రధానంగా ఒకే అంశంపై నొక్కి చెప్పారు. అదే డివిజన్ కార్యాలయంలో ఉండే అందరూ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని. అధికారుల సమన్వయంపైనే ఉన్నతాధికారులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.

డివిజన్ స్థాయిలో అధికారులు ఇలా..

గ్రేటర్ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. అయితే ఒక్కో డివిజన్లో అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కలిపి11 మంది పనిచేయనున్నారు. ఒక్కో డివిజన్ కు హెడ్ గా డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉండనున్నారు. వీరితో పాటు డివిజన్ ఇంజినీర్, డివిజన్ టౌన్ ప్లానర్, ఎంటమాలజిస్ట్, శానిటరీ జవాన్, కమ్యూనిటీ ఆర్గనైజర్, అర్బన్ బయో డైవర్సిటీ సూపర్ వైజర్, వాటర్ బోర్డుకు డివిజన్ అసిస్టెంట్నుం తదితరులు ఉండనున్నారు.