- 18 వేల మంది ఎన్యుమరేటర్లకు బాధ్యతలు
- పర్యవేక్షణకు ప్రతి10 మందిపైఒక సూపర్ వైజర్
- ఒక్కరికి 150 నుంచి 175 ఇండ్ల బాధ్యతలు
- ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని టార్గెట్
- సర్వే తర్వాత డేటా ఎంట్రీ ప్రాసెస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం సిద్ధమైంది. నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణన చేపట్టనున్నారు. ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న సర్వేకు అవసరమైన సిబ్బంది నియామకం, నిర్వహణపై శిక్షణ పూర్తి చేసి ఫామ్స్ కూడా అప్పగించారు. గ్రేటర్‌లోని 30 సర్కిల్స్ కి సంబంధించి మొత్తం18 వేల మందితో సర్వే చేయించనున్నారు.
ఇందులో బల్దియాతో పాటు రెవెన్యూ, టీచర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లతో పాటు ప్రైవేట్ టీచర్ల సేవలు కూడా ఉపయోగించుకోనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి 10 మందిపై ఒక సూపర్ వైజర్‌ను నియమించారు. ఒక్కొక్కరికి 150 నుంచి 175 ఇండ్ల సర్వే బాధ్యతలను అప్పగించారు. సర్వేలో భాగంగా వివరాలు సేకరించి ఇంటికి ఒక స్టిక్కర్ అంటిస్తారు. ఈ సర్వే అంతా వారంలోపు పూర్తి చేయాలని టార్గెట్పెట్టుకున్నారు.
సర్వేలో 75 ప్రశ్నలు
సర్వే కోసం మెుత్తం 75 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఇందులో 56 ప్రధానమైనవి కాగా, 19 అనుబంధ ప్రశ్నలున్నాయి. పార్ట్ –-1, పార్ట్–-2 కింద ఎనిమిది పేజీల్లో ఎన్యుమరేటర్లు సమాచారం సేకరించి ఫిలప్చేస్తారు. ఇందులో పార్ట్–-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. పార్ట్–- బి కింద కుటుంబ వివరాలను తీసుకుంటారు. ఇందులో17 ప్రశ్నలు ప్రధానమైనవి కాగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.
కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, ఇల్లు, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేండ్ల నుంచి తీసుకున్న బ్యాంకు లోన్ల గురించి అడుగుతారు. అప్పులు ఎందుకు తీసుకున్నారు? ఎక్కడ నుంచి లోన్ తీసుకున్నారు? ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటే ఆ వివరాలు సైతం తీసుకుంటారు. గ్రేటర్ లో వ్యవసాయం లేకపోవడంతో వాటి స్థానంలో మిగతా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
పైలట్ ప్రాజెక్టు కింద ఎల్బీనగర్లో షురూ
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్ సర్కిల్ లో అధికారులు శనివారమే సర్వే చేశారు. ఎల్బీనగర్లో ఇప్పటికే చాలా ఇండ్లకు సర్వే పూర్తి చేసి స్టిక్కర్లు కూడా అంటించారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్‌కేశవ్ పాటిల్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద శనివారం ఒక్కరోజు సర్వే చేశామని, ఆరో తారీఖు నుంచి అందరితోపాటు తాము కొనసాగిస్తామన్నారు.