హైదరాబాద్: భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని నాలాలు చెత్తా, చెదారంతో నిండిపోతున్నాయి. పూడికతీత చాలా నెమ్మదిగా జరుగుతోంది. నాలాల్లో చెత్త భారీగా పెరిగిపోతుంటే... క్లియర్ చేసే విషయంలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కేవలం రోడ్లపై చెత్తను క్లియర్ చేయడానికే తాము పరిమితం అవుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ వారు వచ్చి క్లియర్ చేసేంత వరకు ఉండలేక.. కొన్ని చోట్ల ఆయా ప్రాంతాల ప్రజలే స్వచ్ఛందంగా క్లియర్ చేసుకుంటున్నారు. దుర్గంధం పెరిగిపోతుండడంతో ఉండలేక చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఏడాదిలో 5 లక్షల 42 వేల క్యూబిక్ మీటర్ల చెత్త పేరుకుపోగా ఇప్పటి వరకు 3 లక్షల 38 వేల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీశారు. నాలాల పూడికతీత 60 శాతం మాత్రమే పూర్తయిందని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మేరకైనా పనులు జరిగాయా అనేది అనుమానమేనని స్థానికులు భావిస్తున్నారు.