- ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు ఆంక్షలు
- సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ నిర్ణయం
- మెట్రో మార్గంలో అక్రమంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు
- బల్దియా కమిషనర్ దానకిశోర్
వానాకాలంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని బల్దియా కమిషనర్ దానకిశోర్ మంగళవారం జరిగిన సమావేశంలో సూచించారు. ఉన్నత స్థాయి అధికారులతో జరిగిన మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిటీ పరిధిలోని అన్ని రకాల హోర్డింగులను రెండు నెలల పాటు నిషేధించారు. జీహెచ్ఎంసీ,జల మండలి , మెట్రో, విద్యుత్, ఇతర విభాగాలతో 300 విపత్తుల నివారణ స్పెషల్ టీం లు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.
వర్షకాలంలో సంభవించే విపత్తులను ఎదుర్కునేందుకు అన్నిశాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని బల్దియా ఉన్నతాధికారులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్దానకిశోర్అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశానికి మెట్రో రైలు ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీ అనీల్‌కుమార్, సైబరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి, జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు హాజరయ్యారు. వర్షాకాలంలో ఈదురు గాలులకు హోర్డింగులు, యూనిపోల్స్ కూలిపోయే ప్రమాదం ఉందని, జూన్ 15 వ తేదీ నుంచి ఆగస్టు15వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలోని అన్ని రకాల హోర్డింగ్‌లను నిషేధిస్తున్నట్టు సమావేశంలో నిర్ణయించారు.
కమిషనర్ దానకిశోర్మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, జలమండలి, మెట్రో రైలు, విద్యుత్, ఇతర విభాగాల వద్ద అన్ని కలిపి దాదాపు 300 విపత్తుల నివారణ ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ప్రధానంగా 195 కేంద్రాలను నీటి ముంపు ప్రాంతాలుగా గుర్తించామని, వర్షాల సమయంలో వీటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు దానకిశోర్ తెలిపారు. ఆ ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లను మరోసారి తనిఖీ చేసి పూడిక, వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మెట్రో రైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి ప్రస్తావించారు. అయితే మెట్రో రైలు మార్గంలోని అన్ని హోర్డింగ్‌లపై నిషేధం ఉందని అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అద్వైత్‌కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న హోర్డింగ్‌లను తొలగించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించామన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రహదారులపై150 కేంద్రాల్లో రోడ్ల మరమ్మతులు చేయాలని ట్రాఫిక్ విభాగం అడిషనల్ కమిషనర్ అనీల్ కుమార్ సూచించారు. మెట్రో రైలు వంతెనలపై నుంచి వర్షపునీరు రోడ్లపైకి పడుతోందని, నివారించాలని కోరారు. వివిధ ఏజెన్సీలకు గతంలో జారీచేసిన రోడ్డు తవ్వకాలకు సంబంధించి ఆయా రోడ్ల నిర్మాణ పనులను 7 రోజుల్లో పూర్తిచేయాలని కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. చేయని ఏజెన్సీలపై చర్యలు ఉంటాయన్నారు.
వీటితో పాటు ఫైర్, ట్రాఫిక్, రోడ్లు భవనాలు, నీటి పారుదల శాఖతో పాటు ఇతర శాఖలు వద్ద ఎమర్జెన్సీ బృందాలు ఉన్నాయి. కాగా ఈ ఎమర్జెన్సీ బృందాలన్నింటిని నక్లెస్ రోడ్ వద్ద ప్రత్యేకంగా సమావేశపరిచి విపత్తుల సమయంలో సమన్వయంతో పనిచేసేందుకు తగు శిక్షణ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, మెట్రో రైలు, వాతావరణశాఖ, నీటి పారుదల శాఖ, ఫైర్ సర్వీసులు, ఆర్టీసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అధికారులు హాజరయ్యారు.