హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో గురువారం మేయర్గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన మూడో స్టాండింగ్ కమిటీ సమావేశంలో మొత్తం 8 అంశాలకు, ఓ టేబుల్ ఐటమ్ కు సభ్యులు ఆమోదం తెలిపారు. 2020లో భారత్, చైనా బార్డర్ లో దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోశ్బాబు భార్య సంతోషికి బంజారాహిల్స్ రోడ్ నంబర్–14లోని 711 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించారు.
అలాగే సిటీలోని ప్రాపర్టీస్, యుటిలిటీస్మ్యాపింగ్కోసం జీఐఎస్(జియో ఇన్ఫర్మేషన్సిస్టమ్) సర్వే చేయాలని నిర్ణయించారు. ఆ పనులను నియో జియో ఇన్ ఫ్రా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీకి కేటాయిస్తూ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. పైప్ లైన్ రోడ్డు నుంచి కుత్బుల్లాపూర్ మెయిన్ రోడ్డు వరకు (వయా వెన్నెల గడ్డ చెరువు), పైప్ లైన్ రోడ్డు నుంచి గజానన్ ఎన్ క్లేవ్ వరకు 18 మీటర్ల మేర రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయించారు.
వెన్నలగడ్డ చెరువు కట్ట నుంచి గోదావరి హోమ్స్, గాయత్రీనగర్ వరకు 105 ఆస్తులను మాస్టర్ ప్లాన్ లో ఆర్డీపీలను చేరుస్తూ ప్రభుత్వానికి పంపేందుకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. కిషన్‌బాగ్ జంక్షన్ లోని ఇండియానా హోటల్ నుంచి రోడ్డు నం.9, చింతల్ మెట్ మీదుగా పిల్లర్ నం.202 వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా 418 ఆస్తుల సేకరించాలని నిర్ణయించారు.
బార్కాస్ డివిజన్ మజీద్-ఇ-నూర్ ఇస్మాయిల్ నగర్ నుంచి బిస్మిల్లా కిరాణా స్టోర్, అహ్మద్ నగర్, బండ్లగూడ వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పు పనుల కోసం 153 ఆస్తులను మాస్టర్ ప్లాన్‌లో చేర్చి, ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. చాదర్‌ఘాట్ వద్ద మూసీపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి జైలు గార్డెన్ నుంచి శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు 36 మీటర్ల రోడ్డు వెడల్పులో భాగంగా 35 ఆస్తులు సేకరించాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్‌లో అలైన్‌మెంట్‌ను మార్చాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
ఉప్పర్‌పల్లి పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్178 నుంచి సన్‌రైజ్ కాలనీ ధాని రెసిడెన్సీ, సన్‌రైజ్ వ్యాలీ వరకు ప్రతిపాదిత 12 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 67 ఆస్తులు సేకరించేందుకు ఓకే చెప్పారు. మెస్సర్స్ రాంకీ ఫౌండేషన్ సీఎస్సార్నిధులతో జంతు సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులను పూర్తిచేసి లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్ఆర్డీపీ పథకం కింద 60 అడుగుల వెడల్పుతో జోహ్రా బీ దర్గా జంక్షన్ అభివృద్ధి చేయగా, అందుకు ఖర్చు చేసిన రూ.4.50 కోట్లకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో బల్దియా కమిషనర్ ఆమ్రపాలి కాట, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు.