హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో పలుచోట్ల చెత్త, బురద పేరుకుపోయింది. దీంతో ఆ వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఇంటెన్సివ్ యాంటీ లార్వా, క్రిమిసంహారకాల స్ప్రేయింగ్ చేపట్టింది.ఈ విషయమై GHMC కమీషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. వరదముంపుకు గురైన 235 కాలనీలు, 39 చెరువులు, మూసీలలో సోడియం హైపో క్లోరైట్ స్ప్రే చేస్తున్నామని అన్నారు. 125 టీమ్స్ ద్వారా నీటి నిల్వ ప్రాంతాలు, నాలాలలో యాంటీ మలేరియా స్ప్రే, అంటువ్యాధుల నివారణకు నవంబర్ 7 వరకు ఇంటెన్సివ్ స్ప్రేయింగ్ చేస్తున్నామని చెప్పారు.
పారిశుధ్య సిబ్బంది.. వరద నీటిని తొలగించిన 252 ప్రాంతాల్లో, 62 వేల ఇండ్లలోపల, పరిసరాలలో క్రిమి సంహారకాలు స్ప్రే చేశారన్నారు. ఇప్పటివరకు 45 వేల లీటర్ల సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించినట్లు తెలిపారు. చెరువులలో స్ప్రేయింగ్ కు 10 డ్రోన్ల ను వినియోగించామని, నిర్దేశించిన 39 చెరువులలో ఇప్పటి వరకు 17 చెరువులలో స్ప్రేయింగ్ పూర్తయిందని, మరో వారంలో అన్ని చెరువుల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుందని లోకేష్ కుమార్ అన్నారు.