
- 15వ ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చే అవకాశం ఉంది
- సిటీలో ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు కృషి చేయాలి
- ఆయా శాఖల అధికారులతో బల్దియా కమిషనర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ సిటీలో ఎయిర్పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేయాలని, ఎయిర్క్వాలిటీని పెంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ ఇలంబరితి కోరారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంను అమలు చేసేందుకు బుధవారం బల్దియా హెడ్డాఫీసులో పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్కమిషనరేట్ల ట్రాఫిక్ అధికారులు, పీసీబీ, ఆర్టీసీ, భాగ్యనగర్గ్యాస్లిమిటెడ్, హెచ్ఆర్ఎస్, ట్రాన్స్పోర్ట్, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.
కమిషనర్ఇలంబరితి మాట్లాడుతూ.. 15వ ఫైనాన్స్కమిషన్ నిధులతో వివిధ శాఖల ద్వారా చేయాల్సిన పనుల గురించి చర్చించారు. 2024-–25కు రూ. 112.36 కోట్లు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. పీసీబీ మరిన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, స్వీపింగ్ మెషీన్ల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సీఎన్జీపై రాయితీ, బస్సుల నిర్వహణకు సహాయం అందిస్తామని భాగ్యనగర్ గ్యాస్ నిర్వాహకులు చెప్పారు. కార్ పూలింగ్‌ను ప్రోత్సహించి కాలుష్యం తగ్గిస్తామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ చెప్పారు.