జీహెచ్ ఎంసీలో విలీనమైతే..ఎన్నికలు ఉంటయా!?

జీహెచ్ ఎంసీలో విలీనమైతే..ఎన్నికలు ఉంటయా!?
  •     సిటీ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలన ఇంక ఎనిమిది నెలలే.. 
  •     జీహెచ్ఎంసీ లో విలీనంపై ప్రభుత్వ నిర్ణయంతో  నేతల్లో జోరుగా చర్చ
  •     ఎన్నికలు ఉంటాయా.. ముందే వస్తయా అనే దానిపై స్పష్టత లేదు  
  •      పాత రిజర్వేషన్లు ఉండే చాన్స్ ఉండడంతో పోటీకి రెడీగా లీడర్లు 
  •     అధికార పార్టీలోకి భారీగా చేరికలతో టికెట్​ కు ఫుల్ డిమాండ్

 హైదరాబాద్, వెలుగు : సిటీ శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాలన వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. కాగా.. వాటిని జీహెచ్ఎంసీలో వీలినం చేస్తామని రెండునెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే కార్పొరేషన్ లేదా 4 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంఏయూడీకి ఆదేశాలు జారీ చేసింది. వాటి పాలనకాలం కాగానే ప్రక్రియ ప్రారంభమవుతుందనే చర్చ అప్పట్లో జరిగింది. మరోవైపు అధికార పార్టీలోకి వలసలు పెరుగుతుండగా.. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీల మార్పు తెలిసిందే.  

7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు చెందిన మేయర్లు, చైర్మన్లే ఎక్కువగా ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయి కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చింది. దీంతో ఆ పార్టీలోంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. పార్టీ మారిన వారితో కలిసి అవిశ్వాస తీర్మానాలు కూడా పెట్టారు. ఇలా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈనెల 25న మేయర్ ఎన్నిక జరగనుంది.

అదేవిధంగా నార్సింగి మున్సిపాలిటీలోనూ చైర్మన్ పై శనివారం అవిశ్వాస తీర్మానం నిర్వహిస్తారు. దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరుతున్నారు. మరోవైపు టికెట్ కోసం డిమాండ్ పెరగనుంది. దీంతో ఎన్నికలు జరిగితే తనకే టికెట్ కావాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో మంతనాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు కూడా పాతవే ఉండే చాన్స్ ఉండటంతో ప్రస్తుతం ఉన్నవారు మరోసారి కొనసాగేందుకు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వీలినమైతే ఇప్పుడున్నంత మందికి కాకుండా కొందరికి మాత్రమే చాన్స్ రానుంది. ప్రస్తుతం దీనిపైనే నేతల్లో చర్చ జోరుగా నడుస్తుంది. 

ఇప్పటికే రెండు సార్లు చర్చ.. 

శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు గత బీఆర్ఎస్​ప్రభుత్వం అనుకోగా, ప్రక్రియ మాత్రం చేపట్టలేదు.  2019లో సిటీ శివారులోని గ్రామాలను కలిపి 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించింది. ఇందులో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేటప్పుడే వచ్చే ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీలో వీలినం చేస్తామని కూడా ప్రకటించింది. కానీ ఎన్నికలయ్యాక చేపట్టలేదు.

గతేడాది నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓడిపోయి కాంగ్రెస్​అధికారం చేపట్టింది. అనంతరం మళ్లీ రెండు నెలల కిందట మరోసారి విలీన ప్రస్తావన కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మాదిరిగా కాకుండా హెచ్ఎండీఏ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ ఎంసీలో వీలినం చేసేందుకు ప్లాన్ చేస్తుంది.

మరో 8 నెలల్లోఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అయితే.. ఈలోపు జీహెచ్ఎంసీలో వీలినం సాధ్యం కాదనే చర్చ జరుగుతుంది. ఒకవేళ చేస్తే గ్రేటర్ లోని ఆరు జోన్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రేటర్ సిటీలో కోటికిపైగా జనాభా ఉంది. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపితే జీహెచ్ఎంసీ జనాభా దాదాపు 2 కోట్లకు చేరే చాన్స్ ఉంటుంది. 

విలీనమయ్యేవి ఇవే.. 

కార్పొరేషన్లు : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్​పేట్, మీర్ పేట్. 

మున్సిపాలిటీలు :  దమ్మాయిగూడ, నాగారం,  పోచారం, ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌‌‌‌‌‌‌‌పూర్,  పోచంపల్లి, ఇబ్రహీంపట్నం, జల్ పల్లి, పెద్ద అంబర్ పేట్, మేడ్చల్, సంగారెడ్డి, చీర్యాల, తూఫ్రాన్, నర్సాపూర్, శంకర్ పల్లి, తుక్కుగూడ, గుండ్ల పోచంపల్లి, కొత్తూర్, చౌటుప్పల్.