హైదరాబాద్ లో నాలుగు కొత్త కమిటీలు

హైదరాబాద్ లో నాలుగు కొత్త కమిటీలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ అండ్ రోడ్డు మేనేజ్ మెంట్, స్మార్ట్ పోల్ సెటప్ కమిటీ, స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు,  స్ట్రీట్ వెండర్ పాలసీలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కొత్తగా కమిటీలను వేశారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ అండ్ రోడ్డు మేనేజ్మెంట్ కమిటీలో ట్రాఫిక్ అండ్ ఐటీ అడిషనల్ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఇంజినీర్ ఇన్ చీఫ్, యూఎంటీఏ, హెచ్ఎండీఏ ఎండీలు, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, ఖైరతాబాద్ జోన్ కమిషనర్లు మెంబర్లుగా ఉండనున్నారు.

రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్లపై అధ్యయనం చేయడంతో పాటు మరిన్ని సూచనలు, సలహాలతో ఈ కమిటీ ప్రతిపాదనలు రెడీ చేయనుంది. పార్కింగ్ పాలసీ రూపకల్పన చేసి సమగ్ర పార్కింగ్ విధానాన్ని అభివృద్ధి చేయడం, హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గుర్తింపు, ఆన్-స్ట్రీట్, ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ నియంత్రణ,  స్మార్ట్ పార్కింగ్ పై నివేదికలు తయారు చేసి ఇవ్వనుంది.

స్మార్ట్ పోల్ సెటప్ కమిటీలో అడ్వటైజ్ మెంట్ అడిషనల్ కమిషనర్ కన్వీనర్ గా ఉంటారు. ఇందులో ఐటీ అడిషనల్ కమిషనర్ తో పాటు ఎలక్ట్రికల్ అడిషనల్ కమిషనర్లు మెంబర్లుగా పనిచేయనున్నారు. గ్రేటర్ లో విద్యుత్ స్తంభాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడానికి ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది. స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు కమిటీలో ఎలక్ట్రికల్ అడిషనల్ కమిషనర్ కన్వీనర్ గా ఉండగా, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్, సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ సీఈలు మెంబర్లు గా ఉండనున్నారు.

ఈ కమిటీ నగరంలో స్ర్టీట్ లైటింగ్​కు సంబంధించి ఇబ్బందులు లేకుండా కొత్తగా తీసుకోవాల్సిన చర్యలపై  నివేదిక తయారు చేయనుంది. స్ట్రీట్ లైట్లకి సంబంధించి ప్రస్తుతం ఉన్న సంస్థ కాలపరిమితి అయిపోవస్తుండడంతో   కొత్తగా ఏం చేద్దామనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. సిటీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ కోసం భాగస్వాముల సేకరణకు సంబంధించి బాధ్యత వహించనుంది. కొత్తగా టెండర్లు వేస్తే ఎలా వేయాలని దానిపై మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించనుంది. 

స్ట్రీట్ వెండర్ పాలసీ కమిటీకి జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ అడిషనల్ కమిషన్ కన్వీనర్ ఉండగా, ఎస్టేట్స్ అడిషనల్ కమిషనర్, యూఎంటీఏ ఎండీ, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లాన్ మెంబర్లు ఉండనున్నారు. ఈ కమిటీ స్ట్రీట్ వెండర్లను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను రెడీ చేయనుంది.