రోడ్లపై చెత్త పారబోయొద్దు: ఆమ్రపాలి

సికింద్రాబాద్/హైదరాబాద్, వెలుగు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. కాలుష్య నివారణకు మొక్కలు నాటాలని కోరారు. బుధవారం తార్నాక డివిజన్​లో నిర్వహించిన ‘స్వచ్ఛదనం-–- పచ్చదనం’ కార్యక్రమంలో ఆమె పాల్గొని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ తీశారు. స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. రోడ్లపై చెత్తను పారబోయొద్దని, వారంలో ఒకరోజు డ్రై డేను పాటించాలని కోరారు. 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి,  సికింద్రాబాద్ సర్కిల్ డీసీ సుభాష్, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే లోటస్ పాండ్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మొక్కలు నాటారు. స్వచ్ఛదనం– -పచ్చదనంలో భాగంగా 25 చెరువుల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు  తెలిపారు.