చెత్త తరలింపుకు ఐసీసీసీ ఏర్పాటుపై ఆస్కితో చర్చ

చెత్త తరలింపుకు ఐసీసీసీ ఏర్పాటుపై ఆస్కితో చర్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) ఏర్పాటుపై మంగళవారం ఖైరతాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) ఆఫీసులో ఆపరేటర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సమావేశమయ్యారు. చెత్త నిర్వహణ, తరలింపు సవాళ్లను పరిష్కరించేందుకు తీసుకో వాల్సిన చర్యలపై చర్చించారు. 

రోడ్లు ఊడ్చడం, చెత్త సేకరణ, పౌరుల ఫిర్యాదులను పరిష్కరించడం,  సంబంధిత సేవలను సమగ్రంగా పర్యవేక్షించడం వంటి సేవలను ఈ సెంటర్ ద్వారా ఎలా పరిష్కరించాలనే వివరాలు తెలుసుకున్నారు. అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీశ్, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు, 11 కంపెనీల ఆపరేటర్లు పాల్గొన్నారు. 

అంతకు ముందు కమిషనర్​ఆమ్రపాలి అత్తాపూర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, మీర్ఆలం ట్యాంక్, బహదూర్ పుర ఏరియాల్లో పర్యటించారు. చెత్త తరలింపును పరిశీలించారు. అలాగే జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మంగళవారం కిమ్స్, సన్ షైన్ హాస్పిటల్స్ సహకారంతో టీమ్ విమలాకర్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో  నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. క్యాంపులో 250 మంది ఉద్యోగులు, కార్మికులకు టెస్టులు చేశారు.