హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, శానిటేషన్కార్యక్రమాలు సజావుగా సాగాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె సరూర్ నగర్ నుంచి ఎల్బీనగర్, నాగోలు మీదుగా ఉప్పల్ భగాయత్, ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పర్యటించారు. అవసరమైన చోట రోడ్లకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉన్నారు.
అలాగే అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల హెచ్ఓడీలతో కమిషనర్టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు నీటమునుగుతున్న కాలనీల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ కనెక్షన్ కమర్షియల్ గా ఉండి, రెసిడెన్షియల్ టాక్స్ చెల్లిస్తున్న కమర్షియల్ ఆస్తులకు నోటీసులు జారీచేసి ట్యాక్స్ రివిజన్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్రమంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానా వేయాలని ఆదేశించారు.