హైదరాబాద్, వెలుగు: జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం సాయంత్రం తన చాంబర్లో జోనల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు గుర్తించాలని, నివేదికలతోపాటు సంబంధిత ఫొటోలను తనకు పంపించాలని ఆదేశించారు.
డెంగీ కేసులు పెరగకుండా చూడాలని, అవసరమైతే ఐఈసీ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఎంటమాలజీ సిబ్బంది దోమల నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా, ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేలా చూడాలన్నారు. ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ రీచ్కావాలని, శానిటేషన్, సి అండ్ డిపై ఫోకస్పెట్టాలని కమిషనర్ ఆదేశించారు.
జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, రవికుమార్, ఉపేందర్ రెడ్డి, పంకజ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే కమిషనర్ఆమ్రపాలి గురువారం ఉదయం కూకట్ పల్లి, మూసాపేట, భరత్ నగర్ రైతు బజార్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. శానిటేషన్పనులను పరిశీలించారు. ఖైరతాబాద్, ఎల్ బీ నగర్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, రవి కిరణ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.