ఎన్టీఆర్ మార్గ్​లో ఆరు క్రేన్లు ఏర్పాటు

ఎన్టీఆర్ మార్గ్​లో ఆరు క్రేన్లు ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సెప్టెంబర్ 17న జరగనున్న మహా నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు, స్ట్రీట్​లైట్ల ఏర్పాటు, రోడ్లపై గుంతల పూడ్చివేత పూర్తయిందని చెప్పారు.

 గ్రేటర్ ​వ్యాప్తంగా 73 పాండ్లు ఏర్పాటు చేశామని, ఇందులో 27 బేబీ పాండ్స్, 24 ఫోర్టబుల్, 22 ఎస్కలేటార్ పాండ్స్ ఉన్నాయన్నారు. అన్నిచోట్ల 24 గంటలు కరెంట్ సరఫరా, తాగునీరు ఏర్పాటు చేశామని తెలిపారు. 

సరూర్ నగర్ పెద్ద చెర్వు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్ పురా మిరాలం చెరువు, కాప్రా ఊర చెరువుల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయని, 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీ టిప్పర్లు,125 జేసీబీలు,309 మొబైల్ టాయిలెట్స్, 52,270 టెంపరరీ స్ట్రీట్ లైట్స్, 160 గణేశ్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

 అవసరమైన చోట  అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామని తెలిపారు. అలాగే హుస్సేన్​సాగర్​లో నిమజ్జనాలు సందడిగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ మార్గ్​లో 6 క్రేన్లను ఏర్పాటు చేశారు. 

పీవీ మార్గ్ లో ఇప్పటికే 12 క్రేన్లు పెట్టారు. సాగర్ పక్కన మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా హుస్సేన్ ​సాగర్​వద్ద
18 క్రేన్లతో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.