హైదరాబాద్: ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న క్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో కలిసి ఈవీఎం ల స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించారు. హైదరాబాద్ , సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని 14 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని దాన కిషోర్ తెలిపారు. 14 నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 588 మంది సిబ్బందిని ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేశామన్నారు. ఈ సిబ్బందికి ఇప్పటికే ఈనెల 16వ తేదీన ట్రైనింగ్ ఇచ్చామని , మరోసారి 22వ తేదీన ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
స్ట్రాంగ్ రూం లను ఉదయం 5 గంటల సమయంలో పోటీ చేసిన వారి సమక్షంలో ఓపెన్ చేస్తామని దాన కిషోర్ తెలిపారు. 8 గంటల నుండి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘా మధ్యలో జరుగుతుందన్నారు. కౌంటింగ్ సెంటర్స్ లోకి మొబైల్ ఫోన్లను అనుమతి లేదని తెలిపారు.
కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్: సీపీ అంజనీ కుమార్
నగరంలోని అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం భద్రతా ఏర్పాట్లను చేశామని అన్నారు . రిజల్ట్ తర్వాత ఎలాంటి విజయోత్సవ సంబరాలుకు అనుమతి లేదని 144 సెక్షన్ అమలు ఉన్నందున ఫలితాలు వచ్చిన తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు ఎలాంటి సంబరాలు, ర్యాలీలు చేయవద్దని సిపి పేర్కొన్నారు.