హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నగరంలో అన్ని ప్రధాన జంక్షన్లు, చారిత్రక, పర్యాటక స్థలాలు, కార్యాలయాలను ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. నగరంలోని ఆసుపత్రులలో పండ్ల పంపిణీ, ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగే పరేడ్ గ్రౌండ్స్, అమరవీరుల స్థూపం తదితర ప్రాంతాలలో పూర్తిస్థాయి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మే 12న నిర్వహించే మై ఫిట్‌నెస్ – సిటీ ఫిట్‌నెస్ లపై నేడు జీహెచ్ఎంసీ, జలమండలి, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కోచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, చారిత్రక భవనాలు, పార్కులు, తెలంగాణ అమరవీరుల స్థూపాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలను అందమైన విద్యుత్ దీపాలతో జీహెచ్ఎంసీ అలంకరించనున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపాన్ని పుష్పాలతో అలంకరించడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు, శానిటేషన్‌ను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు నగరంలో ఉన్న అమరవీరుల స్మారక స్తూపాల వద్ద ప్రత్యేక అలంకరణ, శానిటేషన్ చేపట్టాలని, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నగరవాసులు పెద్ద ఎత్తున అమరవీరులకు నివాళులర్పించే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి ప్లోరల్ డెకరేషన్ తదితర ఏర్పాట్లను చేపట్టి పరిసరాల పరిశుభ్రతకు అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని కోరారు.
గన్‌పార్క్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయాలని, రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో క్లీనింగ్, లేవలింగ్, రంగురంగుల ఫ్లాగ్‌ల ఏర్పాటు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను చేపట్టాలని దానకిషోర్ ఆదేశించారు. జూన్ 1వ తేదీ నాటికి నగరంలోని అన్ని ప్రధాన రహదారులను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి గుంతలులేని రోడ్లుగా మార్చాలని ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్స్, గన్‌పార్క్ ప్రాంతాల్లో వీధికుక్కలు లేకుండా చూడాలని అన్నారు. నగరంలో చేపట్టిన రహదారులకు సమాంతరంగా మ్యాన్‌హోళ్ల నిర్మాణ పనులను అన్ని ప్రధాన రహదారులలో ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
6వేల మందితో మై ఫిట్‌నెస్ -కార్యక్రమం
సాఫ్ హైదరాబాద్ -షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న ఉదయం 6గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని హెచ్ఎండిఏ పార్టీ జోన్ ఆవరణలో నిర్వహించే మై ఫిట్‌నెస్ – సిటీ ఫిటీ ఫిట్‌నెస్ కార్యక్రమానికి నగరంలోని అన్ని జిమ్‌ల నిర్వాహకులు, ట్రైనర్లతో పాటు జీహెచ్ఎంసీ క్రీడా విభాగానికి చెందిన కోచ్‌లందరూ హాజరవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. 5కె రన్, నగర స్వచ్ఛత కార్యక్రమం పై నిర్వహించే ఈ కార్యక్రమానికి 6వేల మందికి పైగా హాజరవుతారని భావిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. పలువురు ఈ కార్యక్రమానికి పలువురు క్రీడారంగ ప్రముఖులు, బాడీ బిల్డర్లు, సెలబ్రెటీలను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న మాదిరిగానే నగర పరిశుభ్రతకు అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలనే భావనతో ఈ నెల 12వ తేదీ ఉదయం 6గంటలకు మై ఫిట్‌నెస్ – సిటీ ఫిట్‌నెస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు దానకిషోర్ ప్రకటించారు. దీంతో పాటు ఈ నెల 18న నగరంలోని అన్ని ఇంకుడు గుంతల మరమ్మతులను చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు హరిచందన, సందీప్‌జా, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జలమండలి కార్యనిర్వాహక డైరెక్టర్ సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.