టౌన్ ప్లానింగ్ ఏసీపీపై బల్దియా కమిషనర్ సీరియస్

టౌన్ ప్లానింగ్ ఏసీపీపై బల్దియా కమిషనర్ సీరియస్
  • ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఫైర్​ 
  • అక్రమ నిర్మాణాలపై యాక్షన్ ఏదంటూ ఆగ్రహం
  • బర్త్​ సర్టిఫికెట్ల విషయంలో చార్మినార్ మెడికల్ ఆఫీసర్​కు మెమో 
  • జీహెచ్ఎంసీ ప్రజావాణికి 139 అర్జీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల నుంచి వచ్చే సమస్యలను పట్టించుకోని మలక్ పేట టౌన్ ప్లానింగ్ ఏసీపీ గజానందన్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ ​ఇలంబరితి సీరియస్ అయ్యారు. సోమవారం హెడ్డాఫీసులో జరిగిన ప్రజావాణిలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారులు ఆదేశించినా ఫైళ్లు పెండింగ్​పెడుతున్నారని, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని గజానందన్​పై ఫిర్యాదులు రావడంతో కమిషనర్​స్పందించారు. ప్రజల నుంచి వస్తున్న నిర్మాణాల దరఖాస్తులు, అక్రమ నిర్మాణాలపై ఏసీపీ స్పందించకపోతే మీరేం చేస్తున్నారని టౌన్​ప్లానింగ్​ఉన్నతాధికారులపై ఫైర్​అయ్యారు.

టౌన్ ప్లానింగ్ విభాగం స్పీకింగ్ ఆర్డర్స్ జారీ అయిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలపై చార్మినార్ మెడికల్ ఆఫీసర్ జ్యోతి బాయికి మెమో జారీ చేశారు.రికార్డులు లేకుండా బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని కోరారు. గ్రేటర్ పరిధిలో జారీ అయిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లపై విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతున్నదన్నారు. 

హెడ్డాఫీసులోని ప్రజావాణికి 57 ఫిర్యాదులు
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి57 ఫిర్యాదులు అందాయి. ఇందులో టౌన్ ప్లానింగ్ కు సంబంధించి 25 ఉన్నాయి. ఆరు జోన్లలో 82 అర్జీలు అందాయి. కూకట్ పల్లి జోన్ లో 29,  ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్ లో19 , శేరిలింగంపల్లి జోన్ లో 10, చార్మినార్ జోన్ లో 4, ఖైరతాబాద్ జోన్ లో ఒక్క ఫిర్యాదు వచ్చాయి.

హైదరాబాద్ కలెక్టరేట్ ప్రజావాణికి 546
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణికి 546 దరఖాస్తులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ జి.ముకుందరెడ్డి పాల్గొని తీసుకున్నారు. గృహ నిర్మాణ శాఖకు అత్యధికంగా 490 ఫిర్యాదులు వచ్చాయి. 

అడ్డంగా ప్రహరీలు కడితే కూల్చుడే..
హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు వ‌చ్చాయి. ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం కాచ‌వ‌ని సింగారం స‌ర్వే నంబ‌ర్​54లోని భాగ్యన‌గ‌ర్ నంద‌న‌వ‌నం పార్కును క‌బ్జా చేశారని, తుర్కయాంజల్​మున్సిపాలిటీలోని దేవ‌ర‌యాంజ‌ల్ స‌ర్వే నంబ‌రు 452, 453లో 3.39 ఎక‌రాలలో లేఔట్ వేసి ప్రహ‌రీ నిర్మించ‌డంతో త‌మ‌కు దారి లేకుండా పోయింద‌ని, జూబ్లీహిల్స్ ఫిలింన‌గ‌ర్‌లోని రాక్‌ గార్డెన్స్ అని లేఅవుట్‌లో పేర్కొని.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఫిలింన‌గ‌ర్ క‌ల్చర‌ల్ క్లబ్ పేరిట వ్యాపారం చేస్తున్నార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు.

కుషాయిగూడ స‌ర్వే నంబ‌రు 177లోని పార్కు స్థలాన్ని క‌బ్జా చేసి ప్లాట్లుగా అమ్మేశార‌ని.. పార్కు స్థలాన్ని ప‌క్కన ఉన్న లే ఔట్‌లో చూపిస్తున్నార‌ని ఫిర్యాదు అందింది. హైడ్రా చీఫ్​ రంగనాథ్ ​మాట్లాడుతూ రోడ్లకు అడ్డంగా ప్రహ‌రీలు, ఇతర నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తిస్తే వెంటనే తొలగించాలని ఆదేశించారు.